యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తన ఎనర్జిటిక్ డ్యాన్స్, అందమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ఖరారైనట్లు ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల శ్రీలీల ముంబయిలో కరణ్ జోహార్ ఆఫీస్ వద్ద కనిపించడంతో, ఆమె త్వరలో హిందీ సినిమాల్లో కనిపించబోతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌తో కలిసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి త్వరలో ఓ చిత్రంలో నటించనున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు.
బాలీవుడ్ డెబ్యూ కోసం శ్రీలీల రెడీ?
బాలీవుడ్‌లో హిట్ల మీద హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీల నటించబోతుందన్న వార్తలూ బలంగా వినిపిస్తున్నాయి. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌కి శ్రీలీలను సంప్రదించగా, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అయితే గతంలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా సినిమాల్లో నటించనున్నట్లు వచ్చిన వార్తలు ఫేక్ అని హిందీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్‌లో నితిన్‌తో ‘రాబిన్ హుడ్’, పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో ‘పరాశక్తి’ చిత్రంతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతుండటంతో ఆమె కెరీర్ మరింత స్పీడ్ అందుకునే అవకాశం ఉంది.





