- “ఇంటికి వెళ్లాకా కూడా నవ్వుకుంటాం” – పవన్ కామెంట్
- ఎమ్మెల్యే, కార్యకర్త స్కిట్‌లో ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు హాస్యరస భరిత ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి సభ్యుల క్రీడా పోటీల ముగింపు వేడుక గురువారం విజయవాడలోని ఎ. కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన కొన్ని అద్భుతమైన హాస్య ప్రదర్శనలు జరిగాయి. ముఖ్యంగా “అసందర్భ పాటల స్కిట్” చూసి చంద్రబాబు కుర్చీలోంచి లేచి మరీ చప్పట్లు కొట్టారు. పవన్ కల్యాణ్ అయితే “ఇంటికి వెళ్లాక కూడా ఇది గుర్తొచ్చి నవ్వుకుంటాం” అంటూ కామెంట్ చేశారు.
అసందర్భ పాటల స్కిట్ – నవ్వుల పండుగ
ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కలిసి ప్రదర్శించిన “అసందర్భ పాటల స్కిట్” అందరినీ ఉర్రూతలూగించింది. ‘‘పాట పాడితే కొడుతున్నారు అన్నా.. మా ఆవిడ ఏకంగా తంతోందన్నా..’’ అంటూ ఈశ్వరరావు పండించిన హాస్యం చంద్రబాబు, పవన్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహా అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఈ స్కిట్ సాగుతున్నంతసేపు సభ హర్షధ్వానాలతో మార్మోగింది.
ఎమ్మెల్యే, కార్యకర్త స్కిట్ – గడుసు కోరికలతో నవ్వులు
చీఫ్ విప్ జీ.వి. ఆంజనేయులు, గూడూరు ఎమ్మెల్యే సునీల్, ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, బ్రహ్మారెడ్డి, అరవింద్‌బాబు, కూన రవికుమార్ కలిసి చేసిన మరో హాస్య స్కిట్‌లో “ఎమ్మెల్యేను చూసిన కార్యకర్తలు తమ కుటుంబానికి ఉద్యోగాలు, పోస్టులు ఇప్పించమని అడిగితే?” అనే కాన్సెప్ట్ ఉహించలేని నవ్వుల వర్షం కురిపించింది. ఈ స్కిట్‌లో “ఇంటర్ ఫెయిల్ అయిన తమ్ముడికి ఇంజినీరింగ్ సీటు, పది పాస్ కాకుండా హెడ్మాస్టర్ పోస్టు, డిగ్రీ సగమే చదివిన కొడుక్కి ఎస్పీ పోస్టు కావాలి” అంటూ కార్యకర్తలు చేసే హాస్యప్రయోగాలు సభలో నవ్వుల హోరును తెచ్చాయి. ఇన్ని కోరికలు ఎలా నెరవేరుస్తాను?” అని ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు తలపట్టుకోవడం – చూస్తూ ఉన్నవారిని కడుపుబ్బ నవ్వించింది. ఈ వేడుకలోని ప్రతీ స్కిట్ ముగిసిన వెంటనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతలతో కలిసి ఫొటోలు దిగారు. ఏపీ రాజకీయాల్లో ఇటువంటి వినోదభరిత సమయాలు అరుదుగా వస్తాయి. ఇది అందరికీ మరిచిపోలేని క్షణంగా నిలిచింది.





