ఎయిర్ ఇండియా విమానంలో మళ్లీ సమస్య: కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబయి వెళ్తున్న విమానంలో ఇంజిన్ సమస్య, కోల్‌కతాలో ఆగింది.
  • అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత వరుస సాంకేతిక లోపాలతో ప్రయాణికుల్లో ఆందోళన.

శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబయికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI180)లో సాంకేతిక సమస్య తలెత్తింది. మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఈ విమానం టేకాఫ్ సమయంలో ఎడమ ఇంజిన్‌లో సమస్యను సిబ్బంది గుర్తించారు. భద్రతా కారణాలతో విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేయకుండా ప్రయాణికులను దించేశారు. అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అన్నీ సవ్యంగా ఉన్నాయని తేలినప్పటికీ, ప్రయాణికులకు రీషెడ్యూలింగ్ ఆప్షన్లు ఇచ్చారు. ఈ ఘటన ఇటీవలి అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత జరిగింది. ఆ ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు రావడం ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. సోమవారం హాంకాంగ్ నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (AI315)లో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని తిరిగి హాంకాంగ్‌కు మళ్లించాడు. అక్కడ కూడా ప్రయాణికులను దించి తనిఖీలు చేశారు. ఈ వరుస ఘటనలతో ఎయిర్ ఇండియా సేవలపై ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత డీజీసీఏ ఆదేశాల మేరకు బోయింగ్ 787 విమానాలపై సురక్షిత తనిఖీలు జరుగుతున్నాయని ఎయిర్ ఇండియా తెలిపింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *