కోట – బాబూమోహన్: వెండితెరపై నవ్వులు పూయించిన సూపర్ కాంబినేషన్!

  • వందకు పైగా సినిమాల్లో కలిసి నటించి, ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించిన కోట శ్రీనివాసరావు – బాబూమోహన్ జోడీ.
  • ఎప్పుడు చూసినా నవ్వులు పూయించే వీరి కామెడీ టైమింగ్, తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం.

కొన్ని కాంబినేషన్‌లు వెండితెరపై ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తాయి. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఆల్‌టైమ్ సూపర్‌హిట్ జోడీనే కోట శ్రీనివాసరావు – బాబూమోహన్. వీరు పంచుకున్న వినోదం ‘ఎవర్‌గ్రీన్’. ఇద్దరూ కలిసి వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు పాత్ర బాబూమోహన్‌ను డామినేట్ చేసినా, ప్రేక్షకుడికి ఒక్కసారి కూడా విసుగు రాలేదు. కోట ఉంటే బాబూమోహన్, బాబూమోహన్ ఉంటే కోట ఉండాల్సిందే అన్నంతగా వీరి కాంబినేషన్‌కు డిమాండ్ ఉండేది. హీరోలు సైతం తమ సినిమాల్లో వీరిద్దరూ ఉండాలని పట్టుబట్టిన సందర్భాలు ఉన్నాయి.

‘బొబ్బిలి రాజా’తో మొదలైన ప్రస్థానం

కోట – బాబూమోహన్ కాంబినేషన్‌కు నాంది పలికిన సినిమా వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బిలి రాజా’. ఆ సినిమా నుంచే వీరి కామెడీ ప్రస్థానం మొదలైంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఆ తర్వాత వచ్చిన ‘మామగారు’ సినిమా ప్రతి ఒక్కరికీ ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీగా మారిపోయింది. ఈ సినిమాలో కామెడీ సీన్స్ ఎప్పుడు చూసినా నవ్వు ఆపుకోవడం కష్టం. ఇందులో కోట శ్రీనివాసరావు తన ఆహార్యం, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకోగా, బాబూమోహన్ తన టైమింగ్‌తో వినోదాన్ని పంచారు. తన చేతుల్లో బాబూమోహన్ ఎక్కువ దెబ్బలు తింటారని అందరూ అనుకుంటారని, కానీ తాను అలా టచ్ చేస్తే చాలు.. వెళ్లి పడిపోయేవాడని కోట ఒక సందర్భంలో పంచుకున్నారు.

వీరిద్దరి కాంబినేషన్‌లో బాగా పేరు తెచ్చిన చిత్రాలలో ‘చినరాయుడు’ ఒకటి. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య చివరి సన్నివేశం తీయాల్సి ఉంది. అప్పుడు బాబూమోహన్ మరో సినిమా కోసం రాజమండ్రి వెళ్లాల్సిన సమయం దగ్గరపడింది. చెరువు గట్టుపై సీన్. కోట తన్నగానే బాబూమోహన్ కిందపడిపోవాలి. చెరువుకట్ట నుంచి కిందకు 20 అడుగుల లోతు ఉంది. ‘ఈ చెట్టుకు కాయలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టరా?’ అని కోట ఒక్క తన్ను తంతారు. అంతే, అక్కడి నుంచి దొర్లుకుంటూ కిందకు పడిపోయి, ఆ తర్వాత లేచి ‘అన్నయ్యా.. నేను వెళ్తున్నా’ అంటూ బాబూమోహన్ వెళ్లిపోయారట. ఇలా తమ కాంబినేషన్‌లో రూపొందిన ప్రతి సినిమా వెనుక ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని కోట, బాబూమోహన్ పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *