అమెరికాలో ప్రస్తుతం ఇదే చర్చ. అధ్యక్షుడు ట్రంప్ మీడియాకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల వార్తలు ఎక్కువయ్యాయి. ఆయన కొన్ని రోజులుగా బయట కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ట్రంప్ మీడియా ముందుకు రాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ‘ట్రూత్’ (Truth) ద్వారానే వెల్లడిస్తున్నారు. ఆగస్టు 30, 31 తేదీల్లో కూడా ఆయనకు ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు లేకపోవడంతో ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. “గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా పబ్లిక్ మీటింగ్‌లు లేవు. అసలు ఏం జరుగుతోంది?” అని ఒక వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
చేతిపై గాయం, వైద్యుడి వివరణ
ట్రంప్ అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ గాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేకప్ వేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై ట్రంప్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వల్ల, మరియు ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందని ఆయన వివరించారు. అయితే, ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు.
ఊహాగానాలకు కారణాలు
ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఆయన కనిపించకపోవడానికి కొన్ని కారణాలు చెబుతున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం (Labor Day) ఉన్నందున, ఆయన ఈ వారాంతంలో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని ఆయన మద్దతుదారులు అంటున్నారు. అయితే, ట్రంప్ ఎంతో చురుగ్గా ఉన్నారని, ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు దానికి నిదర్శనమని మరికొందరు వాదిస్తున్నారు.





