- విశాఖపట్నంలో కాగ్నిజెంట్తో సహా తొమ్మిది ప్రముఖ ఐటీ సంస్థల శంకుస్థాపన
- పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మెరుగుదల ద్వారా విశాఖ ఐటీ పరిశ్రమలకు ఆదర్శ గమ్యస్థానం
విశాఖపట్టణంలో ఐటీ రంగం కొత్త వెలుగులతో మెరవడానికి రంగం సిద్ధమైంది. తాజా పెట్టుబడుల ప్రవాహంతో నగరం మరింత ఆధునిక రూపం దాల్చనుంది. కాగ్నిజెంట్తో పాటు మరో ఎనిమిది ప్రముఖ ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమాలు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా జరగనున్నాయి. ఈ సంస్థలు రాబోయే మూడు సంవత్సరాల్లో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నట్లు అంచనా.
ప్రస్తుతం విశాఖలో పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పార్కింగ్ సౌకర్యాలు, విస్తరించిన రహదారులు, పైవంతెనలు వంటివి నగరానికి ఆధారం కావాలి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో పాటు ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్‌పోర్టును కూడా కొనసాగించడం కీలకం. గూగుల్, మెటా, రిలయన్స్ వంటి ప్రపంచ దిగ్గజాల డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ఏఐ ఆధారిత స్టార్టప్‌ల పెరుగుదలకు మార్గం సుగమం కానుంది.

విశాఖ: హైటెక్ పరిశ్రమలకు గమ్యస్థానం
రెండు ప్రధాన సముద్రపు భూగర్భ కేబుల్స్, ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటు వల్ల హై స్పీడ్ ఇంటర్నెట్ లభ్యం అవుతుంది. దీని ద్వారా హైటెక్ పరిశ్రమలకు విశాఖ ఆదర్శ గమ్యస్థానంగా మారుతుంది. టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు క్యాంపస్‌లను స్థాపిస్తుండటంతో, అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ దృష్టి విశాఖపై కేంద్రీకృతమవుతోంది. ముఖ్యంగా స్థానిక యువత ఈ ఐటీ సంస్థల అవసరాలకు తగ్గ నైపుణ్యాలను సులభంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
పెట్టుబడుల ప్రవాహం ఇంకా పెరగాలంటే, మౌలిక సదుపాయాల ప్రణాళికలను త్వరితగతిన అమలు చేయాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు, లోకేశ్ విజన్‌తో లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ వైపు వస్తున్నాయని, కేంద్ర సహాయంతో అవసరమైన మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఉందని రుషికొండ ఐటీ హిల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఓ. నరేష్ కుమార్ తెలిపారు.





