చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. కదిరి కాళిదాస్‌గా మెగాస్టార్ కనిపించనున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను ఆయనే స్వయంగా వెల్లడించారు. సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయిందని, సెకండ్ హాఫ్ కూడా 30 శాతం పూర్తయిందని తెలిపారు. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పష్టం చేశారు.
“సంక్రాంతికి వస్తున్నాం.. పండగ మనదే!” చిరంజీవి చెప్పిన ఈ మాటలతో ‘కాకా’పై మరోసారి అంచనాలు పెరిగాయి. (Chiranjeevi’s Kaaka) కదిరి కాళిదాస్‌గా చిరంజీవి కనిపించనున్న ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ పూర్తికాగా.. సెకండ్ హాఫ్ కూడా 30 శాతం పూర్తయిందని చిరు తెలిపారు. మరోవైపు షూటింగ్‌తో పాటు డబ్బింగ్ పనులనూ చిత్రబృందం మొదలు పెట్టింది.
చిరు మాటతో క్లారిటీ..
‘సిగ్మా’ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లిన చిరంజీవి.. తన తాజా చిత్రం ‘కాకా’ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయిందని, సెకండ్ హాఫ్ కూడా 30 శాతం చిత్రీకరణ పూర్తి చేసిందని చెప్పారు. ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పనుల్లో సంగీత దర్శకుడు తమన్ బిజీగా ఉన్నారని తెలిపారు. అంతేకాదు.. విడుదల విషయంలోనూ ఎలాంటి సందేహానికీ తావివ్వలేదు. “కచ్చితంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం. పండగ మనదే” అని చిరు చెప్పడంతో.. ‘కాకా’ విడుదలపై మరోసారి స్పష్టత వచ్చింది.
షూటింగ్ ఓ వైపు.. డబ్బింగ్ మరోవైపు!
సినిమా పనులు ఒక్కొక్కటిగా వేగం పుంజుకుంటున్నాయి. షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే.. చిత్రబృందం డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను టీమ్ సోషల్ మీడియాలో పంచుకుంది. అంటే.. షూటింగ్ పూర్తయ్యేలోపే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నమాట. కదిరి కాళిదాస్ పాత్రలో చిరంజీవి ఎలా కనిపించబోతున్నారు? బాబీ ఈసారి చిరును ఏ తరహాలో చూపించబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.
సంక్రాంతి అంటేనే.. స్టార్ వార్!
2027 సంక్రాంతి ఇప్పటి నుంచే సినీ అభిమానులకు ఆసక్తికరంగా మారుతోంది. ఒకే పండగకు పలువురు అగ్ర కథానాయకుల సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. చిరంజీవి ‘కాకా’ విడుదల ఇప్పటికే ఖరారైంది. ఇక సంక్రాంతి సీజన్‌లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈసారి పండగ బరిలోకి వస్తున్నారు. వెంకటేశ్, కల్యాణ్ రామ్ కథానాయకులుగా.. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 12నవిడుదల కానుంది.
రజనీ కూడా బరిలోనే..
మరోవైపు రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ కూడా సంక్రాంతికే రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాదు.. శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ కూడా పండగ రేసులో ఉన్నాయి. శ్రియారెడ్డి, అక్షయ్ ఖన్నా నటిస్తున్న ‘మహాకాళి’ కూడా సంక్రాంతి బరిలో నిలవనుంది. అంటే.. 2027 సంక్రాంతి వచ్చేసరికి థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండబోదన్నమాట.





