“కేవలం 100 గ్రాముల బరువుతో సరికొత్త మెటా వీఆర్ గ్లాసెస్.. 5K డిస్ప్లే, డాల్బీ విజన్, హోలోగ్రామ్ కాలింగ్ తోపాటు వర్చువల్ ఆఫీస్.. అన్నీ కళ్లముందే సరికొత్త డిజిటల్ ప్రపంచం.”
సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిన పనిలేదు. లైవ్ మ్యాచ్ కోసం స్టేడియం టికెట్ అక్కర్లేదు. అలాగే ఆఫీస్ పని కోసం పెద్ద కంప్యూటర్ మానిటర్ కూడా అవసరం లేదు. చేతిలో ఫోన్ పట్టుకోకుండానే నేరుగా వీడియో కాల్స్ మాట్లాడవచ్చు. (Meta VR Glasses) ఈ అద్భుతాలన్నింటినీ కళ్లద్దాల రూపంలో సాధ్యం చేస్తూ ‘మెటా వీఆర్ గ్లాసెస్’ను మెటా సంస్థ తీసుకొస్తోంది. సాధారణ వీఆర్ హెడ్సెట్లలాగా ముఖంపై బరువుగా ఉండే హార్డ్‌వేర్, స్ట్రాప్స్ ఇందులో ఉండవు. కేవలం 100 గ్రాముల బరువుతో సాధారణ కళ్లద్దాల రూపంలోనే వీటిని డిజైన్ చేశారు. గ్లాసెస్‌లో సెన్సర్లు, డిస్ప్లే మాత్రమే ఉంటాయి. కంప్యూటింగ్, బ్యాటరీ, స్టోరేజ్ కోసం ప్రత్యేకమైన పాకెట్ పక్ (Puck) ఇస్తున్నారు. అది ఆప్టికల్ టెథర్ ద్వారా గ్లాసెస్‌కు కనెక్ట్ అవుతుంది. దీంతో ముఖంపై భారం పడకుండా, ఆ పక్ను జేబుకు లేదా బ్యాగ్‌కు తగిలించుకోవచ్చు.
5K స్క్రీన్.. కళ్లముందే ఐమాక్స్ సినిమా ప్రపంచం
ఈ గ్లాసెస్‌లో మైక్రో-ఓఎల్ఈడీ (micro-OLED) ప్యానెల్స్, 37 పిక్సెల్స్ పర్ డిగ్రీ సపోర్ట్‌తో 5K ఇన్ఫినిట్ డిస్ప్లే అందించారు. ప్రత్యేక పాన్కేక్ లెన్సెస్, డాల్బీ విజన్ కలయికతో రంగులు, విజువల్స్ అద్భుతమైన క్లారిటీతో కనిపిస్తాయి. ఫ్రేమ్స్‌లోనే డాల్బీ అట్మాస్ స్పేషియల్ ఆడియో సిస్టమ్ కూడా ఉండటంతో నిజమైన థియేటర్ సౌండ్ అనుభూతి లభిస్తుంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన కంట్రోలర్లు, రిమోట్ల అవసరం అస్సలు ఉండదు. మెటా ఏఐ ఏజెంట్ నేరుగా ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే పనిచేస్తుంది. కేవలం మాట్లాడటం, కళ్ల కదలికలు, చేతి సంజ్ఞల ద్వారానే ఆప్షన్లను ఆపరేట్ చేయవచ్చు.
మరోవైపు ఇది ఐమాక్స్ ఎన్హాన్స్డ్ (IMAX Enhanced) సర్టిఫైడ్ డివైజ్‌గా రాబోతోంది. డిస్నీ ప్లస్ సాయంతో మార్వెల్ ఎవెంజర్స్, బ్లాక్ పాంథర్ లాంటి 3D సినిమాలు నేరుగా చూడవచ్చు. అవెంజర్స్ టవర్, టాటూయిన్ లాంటి ప్రత్యేక వాతావరణంలో కూర్చుని సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దీంతోపాటు ఐఎల్ఎం (ILM) రూపొందించే డిస్నీ ఇమ్మర్సివ్ సినిమా యాప్ ద్వారా ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, స్టార్ వార్స్ సినిమాలను వీఆర్ ఎన్హాన్స్డ్ వెర్షన్లో ఎంజాయ్ చేయవచ్చు.
స్టేడియంలో ఫ్రంట్ రో సీటు.. జేబులోనే వర్చువల్ ఆఫీస్
ఈ గ్లాసెస్ స్పోర్ట్స్ ప్రియులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. ఈఎస్పీఎన్ (ESPN) భాగస్వామ్యంతో 8K స్ట్రీమింగ్, 180 డిగ్రీల వ్యూస్ ద్వారా స్టేడియంలో ఫ్రంట్ రోలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభవం దక్కుతుంది. అలాగే ఎంఎల్‌బీ, ఎన్బీసీ స్పోర్ట్స్, టీఎన్టీ స్పోర్ట్స్, యూఎఫ్‌సీ లాంటి భాగస్వామ్యాలతో ఏడాదికి 100కు పైగా లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ తీసుకురానున్నారు.
ఇదిలా ఉంటే.. ఆఫీస్ పని కోసం ఎక్కడైనా పెద్ద వర్చువల్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరమైతే ఒకటి కంటే ఎక్కువ స్క్రీన్లను కళ్లముందే సెట్ చేసుకునే సదుపాయం ఉంది. ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ను కీబోర్డ్, టచ్ప్యాడ్లా వాడుకోవచ్చు. ఫుల్ కలర్ పాస్‌త్రూ ఉండటంతో పని చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న డెస్క్, ఫోన్, పరిసరాలను స్పష్టంగా గమనించవచ్చు. మరోవైపు గేమింగ్ కోసం లాంచ్ సమయంలోనే 75కు పైగా హ్యాండ్-గెస్చర్ గేమ్స్ అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌బాక్స్ క్లౌడ్ గేమింగ్ ద్వారా వందలాది గేమ్స్‌ను హ్యాండ్ మూవ్మెంట్స్తోనే ఆడుకోవచ్చు.
వీడియో కాల్లో మీరే హోలోగ్రామ్!
ఈ డివైజ్‌లో మరో సంచలన ఫీచర్ హోలోగ్రామ్ కాలింగ్. మీ ముఖ కవళికలు, ఎక్స్‌ప్రెషన్స్‌ను ప్రతిబింబించే ఫొటోరియలిస్టిక్ డిజిటల్ హోలోగ్రామ్ అవతలి వ్యక్తికి కనిపిస్తుంది. అవతలి వ్యక్తి తన ముందే మీరు నిలబడినట్లుగా చూడగలుగుతారు. స్పేషియల్ ఆడియో వల్ల మీ గొంతు కూడా సరైన దిశ నుంచే వినిపిస్తుంది. వాట్సాప్, జూమ్ లాంటి ఏ కాలింగ్ యాప్‌తోనైనా ఇది సజావుగా పనిచేస్తుంది. ముఖంపై భారీ హెడ్సెట్లు పెట్టుకునే రోజులకు చెక్ పెడుతూ.. కేవలం కళ్లద్దాలు ధరిస్తే చాలు డిజిటల్ ప్రపంచం తెరుచుకునేలా ఈ టెక్నాలజీని మెటా సిద్ధం చేస్తోంది.





