అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (AI171) గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయిన సంగతి తెలిసిందే. 242 మందిలో ఒక్కరు మినహా అందరూ మృతి చెందారు. ప్రమాద కారణం తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్) డీకోడ్ కీలకమని తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్.ఎన్.రెడ్డి తెలిపారు. 24-36 గంటల్లో డీకోడ్ పూర్తవుతుందని చెప్పారు.
బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తే 90% కారణాలు తెలిసిపోతాయి!
సాంకేతిక లోపాలు, పైలట్ల అనుభవ లేమి, వాతావరణ సమస్యలు ప్రమాద కారణాలుగా ఉండవచ్చని, కానీ బోయింగ్ 787 అధునాతనమైనదని, పైలట్లకు అనుభవం ఉందని, వాతావరణం సాధారణంగా ఉందని రెడ్డి వివరించారు. టేకాఫ్ ముందు ఇంజినీర్లు, పైలట్లు అన్ని తనిఖీలు చేస్తారని, అయినా ప్రమాదం జరిగిందన్నారు. రెండు ఇంజిన్లు ఒకేసారి విఫలమయ్యే అవకాశం అరుదని, వేలాది పక్షులు ఇంజిన్లలోకి వెళ్లి లేదా ఇంధన కల్తీ వల్లే ఇలా జరిగే అవకాశం ఉందని చెప్పారు. బ్లాక్ బాక్స్‌లోని కాక్‌పిట్ సంభాషణలు, డేటా విశ్లేషణతో కారణం తేలుతుందని, జనావాసాల్లో కూలడంతో బ్లాక్ బాక్స్ త్వరగా దొరుకుతుందని అన్నారు. AAIB, DGCA విచారణ ద్వారా మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా తేలుస్తాయని చెప్పారు.





