- టిబెట్ సరిహద్దులు, కుంభమేళా కుట్ర నేపథ్యంలో వచ్చిన ‘అఖండ 2: తాండవం
- సనాతన ధర్మం, దేశభక్తి అంశాలతో పాటు యాంటీ-డాట్ వ్యాక్సిన్ చుట్టూ కథ
- బాలకృష్ణ వన్ మ్యాన్ షో
‘అఖండ’ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను అదే ఊపులో ‘అఖండ 2: తాండవం’ అంటూ ఈసారి కథను సరిహద్దులు దాటించారు. ఈసారి అఘోరా పాత్రకు మరింత డోస్ పెంచి, బాలకృష్ణతో సర్జికల్ స్ట్రైక్ చేయించారు. టిబెట్ సరిహద్దుల్లో కథ మొదలవుతుంది. శత్రుదేశమైన చైనా ఆర్మీ అధికారులు భారతీయుల నమ్మకాలను దెబ్బ కొట్టాలని కుంభమేళాను లక్ష్యంగా చేసుకుని బయోవార్కు దిగుతారు. ఈ కుట్రతో చాలా మంది అపస్మారక స్థితికి చేరుకుంటారు. దీనికి విరుగుడుగా డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు యాంటీ డాట్ వ్యాక్సిన్‌ను కనుగొంటారు. ఆ వ్యాక్సిన్‌తో బయటపడిన యువ శాస్త్రవేత్త జనని (హర్షాలీ మల్హోత్రా)ని రక్షించడానికి రుద్ర సికిందర్ అఘోరా (బాలకృష్ణ) రంగంలోకి దిగుతాడు.
ఎమ్మెల్యే బాల మురళీకృష్ణ ఎందుకు వచ్చారు?
ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి అఘోరా పాత్ర, మరొకటి అనంతపురం ఎమ్మెల్యే బాల మురళీకృష్ణ పాత్ర. మాస్ హీరోలను చూపించడంలో బోయపాటి శైలిని పతాక సన్నివేశాల్లో అఘోరా పాత్ర పూర్తిగా హైలైట్ చేసింది. అయితే ఎమ్మెల్యే బాల మురళీకృష్ణ ఎపిసోడ్ అంతా దాదాపు తొలి భాగం ‘అఖండ’ టెంప్లేట్‌లోనే సాగుతుంది. ఈసారి ఆయన మత్తు మందులు సరఫరా చేసే అంతర్రాష్ట్ర ముఠాపై సమర శంఖం పూరిస్తారు. బాల మురళీకృష్ణ పాత్ర పరిచయ సన్నివేశాలు, ఎలివేషన్లు మాస్ ప్రేక్షకులకు పండగే. తొలి భాగం కంటే ద్వితీయార్థం మరింత హైలైట్. విరామం తర్వాతే బాలయ్య అసలు సిసలు తాండవం మొదలవుతుంది. తల్లి సెంటిమెంట్, దేశభక్తి, హిందు ధర్మం నేపథ్యం వరకు దాదాపు ప్రతీ సన్నివేశం రోమాలు నిక్కబొడిచేలా ఉంటుంది.
హైలైట్:
- బాలకృష్ణ: అఘోరా పాత్రలో విశ్వరూపం చూపించారు. సంభాషణలు, యాక్షన్ ఘట్టాలతో వన్ మ్యాన్ షో చేశారు.
- తమన్: నేపథ్య సంగీతం అద్భుతం. పాటలు కథలో కలిసిపోయాయి.
- యాక్షన్: సర్జికల్ స్ట్రైక్ సన్నివేశాలు, వేద భూమి గొప్పతనాన్ని చెప్పే సంభాషణలు సినిమాకు ప్రధాన బలం.
మిస్సింగ్:
- కథనం: కొనసాగింపు చిత్రానికి తగినట్లుగా కథ పరిధిని పెంచారు కానీ, దానికి కొత్తదనం తీసుకురావడంలో బోయపాటి కొంచెం తగ్గారు. అఖండ టెంప్లేట్లోనే చాలా సన్నివేశాలు సాగాయి.
- విలన్ పాత్రలు: ప్రతినాయక పాత్రల్లో బలం లేదు. ఆది పినిశెట్టి పోషించిన నేత్ర పాత్రే కొంత పర్వాలేదు.
- నాయిక: సంయుక్త పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు.





