మద్యం మత్తు తండ్రీకొడుకుల మధ్య వివాదాన్ని రేపింది. అంతేనా.. తండ్రే కొడుకు పాలిట కాలయముడు అయ్యేలా చేసింది. నర్సీపట్నం పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కఠారి రమణ (70) తన కుమారుడు భాస్కరరావు (32)ను తీవ్ర ఆగ్రహంలో పూరీ కర్రతో కొట్టి చంపాడు.శనివారం రాత్రి భాస్కరరావు తమ స్నేహితుడు జిలానీతో కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో డబ్బు దుబారా విషయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. జిలానీ వెళ్లిపోయిన తరువాత కూడా ఈ వాదన కొనసాగి చివరకు హింసకు దారితీసింది. మద్యం మత్తులోనే రమణ కొడుకుపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.తెల్లవారిన తర్వాత మెలకువ వచ్చిన రమణ రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును చూసి విలపించాడు. పనిమనిషి పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ గోవిందరావు సంఘటన స్థలానికి చేరుకుని రమణను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.





