సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆస్పత్రికి చేరుకున్న అల్లు అర్జున్ దాదాపు 20 నిమిషాల పాటు వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌తోనూ మాట్లాడి ధైర్యం చెప్పారు. గత డిసెంబర్ 4న ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తన బాధను వ్యక్తం చేసిన అల్లు అర్జున్ రూ. కోటి, ‘పుష్ప 2’ నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షలు రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సాయం దిల్ రాజు ద్వారా అందజేయడం విశేషం.





