- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాాదం
- ఓ ప్రైవేటు బస్సు లోయలోకి
- ప్రమాదంలో 8 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది
- ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందినవారుగా గుర్తింపు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రహదారిలోని రాజుగారిమెట్ట ప్రాంతంలో ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా 35 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ యాత్రికులు భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్లే దారిలో ఈ విషాదం జరిగింది. వీరంతా చిత్తూరు జిల్లా ప్రాంతాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సీఎం దిగ్భ్రాంతి: బాధితులకు తక్షణ సహాయం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోయలో పడిన బస్సు కారణంగా యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. గాయపడిన వారిని వెంటనే చింతూరు ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు సీఎంకు వివరాలు అందించారు. సీఎం వెంటనే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు స్పష్టం చేశారు.





