సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్, లింగ మార్పిడి తర్వాత క్రికెట్లో ఎదురైన సవాళ్లపై ‘లల్లాన్ టాప్’ ఇంటర్వ్యూలో బలమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు క్రికెటర్లు తనకు నగ్న ఫొటోలు పంపమని అడిగారని, వేధింపులకు గురైనట్లు ఆమె గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన తండ్రి సంజయ్ బంగర్ క్రికెట్ ఆడొద్దని సూచించినట్లు తెలిపారు. ఐసీసీ నిబంధనల వల్ల మహిళల క్రికెట్లో ట్రాన్స్జెండర్ ఆటగాళ్లకు అవకాశం లేకపోవడంతో, ఆమె క్రికెట్ కెరీర్ను వదులుకోవాల్సి వచ్చింది. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్లతో దేశవాళీ క్రికెట్ ఆడిన అనయ, తన లింగ మార్పిడి కారణంగా సమాజం, క్రికెట్ ప్రపంచంలో అవకాశాలు కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉందనిపించింది. అమ్మాయిగా మారడం వల్లే నాకు అవకాశం, హక్కులు లేవు,” అని అనయ బాధతో చెప్పారు.
అనయ తన క్రికెట్ జీవితంలో ఎదురైన వివక్ష, టాక్సిక్ మాస్క్యులినిటీని బహిర్గతం చేశారు. తన తండ్రి సంజయ్ బంగర్ ప్రముఖ వ్యక్తి కావడంతో ఆమె తన గుర్తింపును రహస్యంగా ఉంచవలసి వచ్చింది. ఐసీసీ 2023లో ట్రాన్స్జెండర్ మహిళలను అంతర్జాతీయ మహిళల క్రికెట్ నుంచి నిషేధించడంతో ఆమె కలలు భగ్నమయ్యాయి. కుటుంబం నుంచి కొంత మద్దతు లభించినప్పటికీ, సమాజం, క్రికెట్లో సరైన అవకాశాలు లేకపోవడంతో ఆమె డిజైన్ రంగంలో కెరీర్ను ఎంచుకున్నారు. అనయ ఇప్పుడు యూకేలోని మాంచెస్టర్లో నివసిస్తూ, ట్రాన్స్జెండర్ హక్కుల కోసం సోషల్ మీడియాలో వాదిస్తున్నారు.





