ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా విధ్వంసానికి గురైన పరిస్థితి నుంచి పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుందని, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కేవలం ఏడు నెలల్లో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగడం గర్వకారణమని చంద్రబాబు అన్నారు. రామాయపట్నంలో రూ.70 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కేంద్ర సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు. మోదీ ఆశీర్వాదాలతో నదుల అనుసంధానం చేపట్టామని, రాష్ట్రానికి ఇది ప్రయోజనకరమని వివరించారు.
మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి
‘‘మోదీ దారిలోనే పనిచేస్తూ దేశ అభివృద్ధికి కేంద్రం తీసుకున్న నిర్ణయాలు నాకు స్ఫూర్తినిస్తున్నాయి. ఆయన ప్రపంచ నాయకుడిగా ఎదిగారు. ఐటీ, ఫార్మా, టూరిజం రంగాల్లో మోదీ తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవరోధాలు ఎదురైనా, మోదీకి వివరిస్తే వెంటనే నిర్ణయం తీసుకున్న విధానాన్ని ఆయన కొనియాడారు.
2047 లక్ష్యం, భవిష్యత్తు దిశ
‘‘మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుతుందనే నమ్మకం ఉంది. 57% ఓట్లతో మేం సాధించిన విజయానికి మోదీ చరిష్మా కారణమైంది. భవిష్యత్తులోనూ మా కాంబినేషన్ కొనసాగుతుంది’’ అని చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా మారుతుందని, ఐటీ, టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






