సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి, రామవరప్పాడు, అంపాపురంలో కోడి పందేలు నిర్వహించగా, వీటిని చూడటానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. పల్లెల్లోని బరుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ పందేలు గ్రామీణ ప్రాంతాల్లో పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచాయి.
ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోనూ కోడి పందేలు సందడి చేస్తాయి. నందిగామ, చందర్లపాడులో జోరుగా సాగుతున్న ఈ పోటీలు ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కంచికచర్ల మండలం గండేపల్లి వద్ద ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కోడి పందేలను ప్రారంభించడంతో పండుగ ఉత్సవాలు ఊపందుకున్నాయి.





