- “పదినిమిషాలకే వెళ్లిపోవడం ప్రజా బాధ్యత మర్చిపోవడమే”
- “గతంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిన జగన్”
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలే ఉండి వెళ్లిపోవడంపై అధికారపక్షం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి పురంధేశ్వరి చురకలంటించారు. ‘‘ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుంది. అందుకే జగన్ నిన్న సభకు వచ్చి అటెండెన్స్ వేసి వెళ్లిపోయారు. కానీ ప్రజలిచ్చిన బాధ్యతను మరచిపోవడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు.
“అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన బాధ్యత ప్రతిపక్షనేతగా జగన్‌ది. కానీ హాజరు కోసం మాత్రమే సభకు రావడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు. “గతంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిన జగన్” అని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆలోచనల మేరకే కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగిందని పురంధేశ్వరి తెలిపారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను అవమానించింది’’ అని విమర్శించారు. మహిళలు, యువత, పెట్టుబడులు, వ్యవసాయ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు.
- రాబోయే ఐదేళ్లలో మూడు కోట్ల ఇళ్లను పేదలకు నిర్మిస్తామని చెప్పారు.
- డ్రోన్ల ద్వారా మహిళలు వ్యవసాయం చేసే కార్యక్రమానికి బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించామని తెలిపారు.
- విశాఖ, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు.
- రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రికి కొత్త భవనాలు నిర్మించి, శస్త్రచికిత్సలు అందుబాటులోకి తెస్తామని వివరించారు.





