ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పరిపాలనలో తప్పుడు ఆర్థిక నిర్వహణ వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, దాని ప్రభావం మౌలిక సదుపాయాలపై కనపడుతోందని తెలిపారు. విజయవాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ మాట్లాడారు.
పునర్నిర్మాణానికి ఎన్డీయే సర్కారు సహకారం
గత ప్రభుత్వ హయాంలో మితిమీరిన అప్పులు, నిలిచిపోయిన ప్రాజెక్టులు రాష్ట్రానికి భారంగా మారాయని, ప్రజలు చరిత్రాత్మక తీర్పు ద్వారా ఆ పాలనను తిరస్కరించారని గవర్నర్ పేర్కొన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో మళ్లీ స్థిరపడుతుందన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని పనులు, విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ వంటి నిర్ణయాలు రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదం చేస్తున్నాయన్నారు. గవర్నర్ ప్రసంగంలో స్వర్ణాంధ్ర విజన్ – 2047 ప్రస్తావన అందరిలో ఉత్సాహం నింపింది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థను ప్రస్తుతం రూ.16 లక్షల కోట్ల నుంచి 2047 నాటికి రూ.305 లక్షల కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. తలసరి ఆదాయాన్ని భారీగా పెంచే విధానాలు రూపొందించామని, ఈ మార్గదర్శక సూత్రాలు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం వంటి లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.






