2024కి గుడ్‌బై చెప్పి 2025కి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు గుడ్‌న్యూస్ అందించింది. నూతన సంవత్సర సంబరాల సందర్భంగా మద్యం విక్రయ సమయాన్ని ప్రత్యేకంగా పొడిగించింది. సాధారణంగా రాష్ట్రంలో మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకే పనిచేస్తాయి. అయితే డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో మద్యం వినియోగం అధికంగా ఉంటుందని అంచనా వేసి, ప్రభుత్వం ఆ రెండు రోజులకు రాత్రి 1 గంట వరకు మద్యం షాపులు, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం ద్వారా బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేసే పరిస్థితులు తప్పించవచ్చని ప్రభుత్వం భావించింది.
మద్యం అమ్మకాలు..
ఏపీలో ప్రైవేట్ లిక్కర్ షాపులు అందుబాటులోకి వచ్చిన అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ 75 రోజుల కాలంలో 26,78,547 కేసుల బీర్ విక్రయాలు కాగా, 83,74,116 కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. కొత్త సంవత్సరానికి సంబంధించిన డిమాండ్ ప్రకారం సరుకును సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.





