రాష్ట్ర ఆదాయ వృద్ధిపై సీఎం సమీక్ష: ప్రజలపై భారం వేయలేం!!

  • 2024-25లో రాష్ట్ర ఆదాయం ₹1,02,154 కోట్లు చేరనున్నట్లు అంచనా.
  • ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.

రాష్ట్ర ఆదాయ వృద్ధిపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన సీఎం, వైకాపా హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఆదాయ వృద్ధే మార్గమన్నారు. అయితే, ప్రజలపై అదనపు భారం మోపకుండా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పన్ను ఎగవేతను అడ్డుకోవాలని, కానీ వ్యాపారులను వేధించరాదని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు.

రాష్ట్ర ఆదాయ అంచనా

సమావేశంలో అధికారులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల ద్వారా రాష్ట్రానికి ₹41,420 కోట్లు ఆదాయం వచ్చిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ₹41,382 కోట్లు వచ్చాయని వివరించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త ఎక్సైజ్ విధానం వల్ల ఆ శాఖ ఆదాయంలో పెరుగుదల కనిపించనుందని తెలిపారు. అయితే గనుల శాఖలో ఇప్పటి వరకు ఆశించిన ఆదాయం రాలేదని పేర్కొన్నారు. మొత్తం మీద 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం ₹1,02,154 కోట్లు చేరుతుందని అంచనా వేశారు. కోర్టు కేసుల పరిష్కారం, గనుల అనుమతుల మంజూరు ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇకపై ఆదాయ పరిస్థితిపై తరచూ సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు.

ఆర్థిక స్వావలంబనదే లక్ష్యం

ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా ఎదగాలంటే ఆదాయాన్ని సమర్థవంతంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సాధారణ పనితీరుతో సరిపెట్టుకోకుండా కొత్త మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సరిపడా వనరులు అందుబాటులో ఉండాలంటే ఆదాయ వృద్ధి తప్పనిసరి అన్నారు. కేంద్ర నిధుల కోసం నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాతో దిల్లీలో 1.45 గంటలపాటు భేటీ అయ్యి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. “నా తపనంతా రాష్ట్ర అభివృద్ధికే. మీరు కూడా ఇదే దిశగా పనిచేయాలి” అని అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *