చైనాలోని సిచువాన్ ప్రావిన్సులో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్ వినియోగదారుల ఆరోగ్యాన్ని విస్మరించి, విస్తుగొలిపే విధంగా వ్యవహరించింది. కస్టమర్లు మిగిల్చిన ఆహారం నుంచి నూనెను సేకరించి, దాన్ని కొత్త నూనెలతో కలిపి వంటకాల్లో ఉపయోగిస్తున్న విషయం బయటపడింది. ఈ వివరాలు ఓ వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో రెస్టారెంట్ యాజమాని దారుణమైన ఈ తతంగాన్ని అంగీకరించాడు. ‘‘సెప్టెంబర్ నుంచి మిగిలిన చిల్లీ ఆయిల్ సూప్‌ల నుంచి నూనె సేకరించి, ఫుడ్ ఫ్లేవర్ పెంచడం కోసం ఇలా చేస్తున్నాం’’ అని తెలిపారు. బిజినెస్ తగ్గిపోవడంతో వంటకాల రుచిని పెంచేందుకు ఈ పద్ధతిని అవలంబించినట్లు స్పష్టం చేశారు. ఈ అనాగరిక చర్యకు ‘‘సలైవా ఆయిల్’’ అనే పేరు పెట్టడం మరింత కలవరపెట్టే అంశం.
ఫుడ్ సేఫ్టీ అధికారులు రీసైకిల్ చేసిన నూనెలను సీజ్ చేసి, దీనిపై పోలీసులకు కేసు బదిలీ చేశారు. గతంలోనూ చైనాలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రెస్టారెంట్లు మిగిలిపోయిన ఆహార పదార్థాల నుంచి నూనె సేకరించి తిరిగి విక్రయించిన ఘటనలతో చైనా ప్రభుత్వం 2009లో ఫుడ్ సేఫ్టీ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఈ చట్టం ప్రకారం, ఇలాంటి చర్యలకు పాల్పడితే భారీ జరిమానాలు మరియు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించబడే అవకాశం ఉంది.





