నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు… మార్చి 19న యూకే పార్లమెంట్ లో జీవిత సాఫల్య పురస్కారం.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా యూకే పార్లమెంట్ ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనుంది. మార్చి 19న లండన్ లోని యూకే పార్లమెంట్ లో ఈ పురస్కారాన్ని చిరంజీవికి అందజేయనున్నారు.
తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు
‘పునాదిరాళ్ళు’ సినిమాతో మొదలైన చిరంజీవి సినీ ప్రయాణం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అగ్ర కథానాయకుడిగా ఎదిగిన ఆయన, తన నటనతో, డ్యాన్సులతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 150కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి, 9 ఫిల్మ్ ఫేర్, 3 నంది అవార్డులతో పాటు పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న చిరంజీవి, త్వరలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.





