భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)’ను నిర్వహించనుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రముఖ సినీ నటులు, వ్యాపారవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకున్నారు.
“ఈ భాగస్వామ్యం గర్వంగా ఉంది”
ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని, వేవ్స్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డులో భాగమవడం గర్వంగా ఉందని తెలిపారు. మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ దృశ్యాలను షేర్ చేస్తూ – “భారతదేశాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ముందుకు తీసుకెళ్లే గొప్ప కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది. మోదీ ఆలోచనలు దేశాన్ని ప్రపంచ స్థాయిలో మరింత ముందుకు నడిపిస్తాయనడంలో సందేహం లేదు” అని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సమావేశంలో అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, నాగార్జున, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, హేమామాలిని, దీపికా పదుకొణె తదితరులు పాల్గొన్నారు. అలాగే వ్యాపార దిగ్గజాలు ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా సమ్మిట్‌పై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.





