సంక్రాంతి పండుగ దగ్గరపడుతోంటే కోడి పందాల హడావుడి ప్రారంభమవుతోంది. పందాలపై నిషేధం ఉన్నా, ఉమ్మడి జిల్లాలో గుట్టుగా బరులు సిద్ధం చేస్తున్నారు. పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ, సన్నద్ధతతో కోళ్ల పోరాటాలను మరింత సవాళ్లతో చేయడానికి పందెం రాయళ్లు కృషి చేస్తున్నారు.
పందెంకోళ్ల శిక్షణ
కొంతమంది ప్రత్యేకంగా పందెంకోళ్లకు శిక్షణ ఇస్తున్నారు. పండగ నాలుగు రోజులు పందేలతో పాటు ఆయా బరుల వద్ద బెట్టింగ్లు, గుండాట, ఇతరత్రా కార్యకలాపాల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. కాళ్ల, వీరవాసరం, నరసాపురం, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. మరో వైపు కోడి పందేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వం.. సంప్రదాయం ముసుగులో ఎక్కడా పందేలు నిర్వహించినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కోళ్ల రకాలు మరియు ధరలు
పందెం కోళ్లలో అత్యధికంగా కోడి నెమలి, అబ్రాస్, ఎర్ర డేగ, కక్కెర వంటి రకాలకు మంచి డిమాండ్ ఉంది. సైజు, రంగు, జాతిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతోంది. ఆన్లైన్లో కోళ్లను పెంచేవారు వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఖరీదైన కోళ్ల జాతులు మరియు వాటి వివరాలను పంచుకుంటున్నారు. భీమవరం, పాలకొల్లు, పోడూరు వంటి ప్రాంతాలకు చెందిన కొందరు వాట్సాప్ గ్రూపుల ద్వారా విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి కోళ్లను తెచ్చి విక్రయిస్తున్నారు. ఇక కోళ్లని పెంచే క్రమంలో పలు రకాల పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. కొన్ని రోజులు కోడిని ఎండలో కట్టేస్తారు. శరీరం చురుగ్గా ఉండేందుకు వారానికోసారి 10 నిమిషాల పాటు ఈత కొట్టిస్తారు. కొవ్వు చేరకుండా యూకలిప్టస్, కుంకుడు ఆకులు నీటిలో వేసి మరగబెట్టిన తర్వాత పుంజులకు స్నానం చేయిస్తారు. ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నారుజ 40 రోజుల పాటు కోడిగుడ్డు.. 60 రోజుల పాటు బాదం పప్పు.. ఖీమా.. బీకాంప్లెక్స్ ట్యాబ్లెట్లు కూడ వేస్తున్నారు.






