
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. పందాలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆహారం మరియు శిక్షణ ఇచ్చి బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు.పందెం రాయుళ్లను ఆకట్టుకునేలా పుంజులను సన్నద్ధం చేస్తున్నారు. కొందరు ఆన్లైన్లోనే వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడిపందేలే అని పరిస్థితి తయారైంది. స్థానికుల కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా పాల్గొంటున్నారు.సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లో రూ.500 కోట్లకు పైగా చేతులు మారతాయని అంచనా.
దీంతో పుంజుల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయిల్‌పాం తోటలు, చెరువు గట్లు, పొలాలు తదితర ప్రాంతాల్లో కోళ్ల పెంపకాలు జరుగుతున్నాయి.ఉమ్మడి గోదావరి జిల్లాల్లో దాదాపు 400 పెంపకం కేంద్రాలున్నాయి. ఇప్పటికే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు కోళ్ల కొనుగోళ్లకు సిద్ధపడుతున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సంక్రాంతికి ఇక్కడకు వచ్చేవారు ఆన్లైన్లో పుంజులను చూసి బేరమాడుకుంటున్నారు.పోరాటం చేసే విధానం, రంగు, ఎత్తును బట్టి ఒక్కో పుంజును రూ.25 వేల నుంచి రూ.3 లక్షల వరకు అమ్ముతారు. ఈ నెల రోజుల్లో దాదాపు ఏడు వేలకు పైగా పుంజులు అమ్ముతారని అంచనా. వీటి అమ్మకాలపై రూ.25 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది.
నెమలి, అబ్రాస్, పింగళ, పర్ల, మైల, డేగ వంటి జాతులకు చెందిన రెండేళ్ల వయసున్న కోళ్లను పందేలకు సిద్ధం చేస్తారు. నిత్యం ఉడకబెట్టిన గుడ్లు, బాదం, ఉడికించిన మటన్, జీడిపప్పు వంటి ప్రత్యేక ఆహారం అందిస్తారు.ఈ మేతతో కోళ్ల బరువు పెరగకుండా చురుగ్గా పోరాటం చేయడానికి ప్రేరణ ఇస్తారు. పొగరు పెరగడానికి అశ్వగంధ పొడి పట్టిస్తారు. 90 రోజుల పాటు ఇదే తరహా ఆహారం అందిస్తారు.చేప్పాలంటే, కోళ్లను ఇంట్లో బాలింత కంటే భద్రంగా చూస్తారు. స్నానానికి వేడి నీటినే వాడుతారు. అలుపు నియంత్రణ కోసం వారానికి ఒకసారి ఈత కొట్టిస్తారు.ప్రత్యేక ఆహారం, రోగాల నివారణకు మందుల వినియోగం మరియు ఇతర ఖర్చులు కలిపి ఒక్కో కోడిని సిద్ధం చేసేందుకు రూ.30 వేల వరకు ఖర్చవుతుందని పెంపకందారులు చెబుతున్నారు.





