గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు.. అన్నట్టుగా సోషల్ మీడియాలో చాలా మంది స్వీట్ గా దగ్గరవుతున్న హ్యాకర్ల ఉచ్చులో పడుతున్నారంట. అందుకు సాక్ష్యమే పిగ్ బుచరింగ్ స్కామ్. నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులు, పేదలు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు వేసే గాలమే ‘పిగ్ బుచరింగ్ స్కామ్’ . దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఈ స్కామ్ పెరుగుతోందని కేంద్ర హోంశాఖ తాజా నివేదిక వెల్లడించింది. ఈ తరహా మోసాల ద్వారా ప్రజలు నిత్యం భారీగా ఆర్థిక నష్టం పొందుతున్నారు. గూగుల్, ఫేస్బుక్ లను వేదికగా చేసుకుని హ్యాకర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు.
పిగ్ బుచరింగ్ స్కామ్ అంటే ఏమిటి?
పిగ్ బుచరింగ్ స్కామ్ అనేది ఆన్లైన్ మోసానికి ఉపయోగించే విధానం. సైబర్ నేరగాళ్లు ముందుగా సులభంగా మోసపోయే వ్యక్తులను గుర్తిస్తారు. వారితో విశ్వాసం పెంచుతూ, క్రిప్టోకరెన్సీ లేదా మరో లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టాలని ప్రలోభ పెట్టి, చివరికి వారి డబ్బును కాజేస్తారు. ఈ స్కామ్ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. ‘పందులను వధించే ముందు కసాయి వాటికి మంచి ఆహారం అందిస్తాడు.. తర్వాత వధిస్తాడు’ ఇదే మాదిరిగా సోషల్ లైఫ్ లో స్వీట్ గా దగ్గరై.. చీట్ చేస్తున్నారు. ఈ తరహా మోసాలు 2016లో చైనాలో మొదలై, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాయి.
స్కామ్ ఎలా జరుగుతోంది?
- గూగుల్ వేదికలు: విదేశాల నుంచి గూగుల్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి లక్ష్యప్రాయంగా ప్రకటనలు ఇస్తున్నారు.
- ఫేస్బుక్ మరియు వాట్సప్: రుణాల పేరుతో లింకులు పంపుతూ వ్యక్తులను ఆకర్షిస్తున్నారు.
- క్రిప్టో పథకాలు: లాభాలను చూపించి పెట్టుబడులు పెట్టిస్తున్నట్లు నమ్మిస్తున్నారు.
ప్రభుత్వ చర్యలు
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గూగుల్, ఫేస్బుక్ వంటి టెక్ సంస్థలతో కలిసి ఈ తరహా మోసాలను ఎదుర్కొనేందుకు చర్యలు చేపడుతోంది. తక్షణ సమాచారం ద్వారా సైబర్ నేరాలను నియంత్రించేందుకు కార్యచరణను చేపట్టింది.
వీటిని ఫాలో అవ్వండి
- అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదు.
- తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకూడదు.
- ప్రతి ఆన్లైన్ ప్రకటనకు వ్యతిరేకంగా పరిశీలన చేయాలి.






