
ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) ఇక లేరు. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తొలుత ఆయన మరణంపై కొన్ని వార్తలు వెలువడగా, కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. అయితే తాజాగా ఆయన మరణాన్ని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.
1951 మార్చి 9న ముంబయిలో జన్మించిన జాకీర్ హుస్సేన్ ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడు. తండ్రి బాటలోనే నడిచిన ఆయన చిన్న వయస్సులోనే తబలాలో అపారమైన ప్రతిభ కనబరిచారు. హిందుస్థానీ క్లాసికల్ సంగీతంతో పాటు జాజ్ ఫ్యూజన్ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు.
జాకీర్ హుస్సేన్ ఆరుదశాబ్దాల పాటు సాగిన తన సంగీత ప్రయాణంలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల మన్ననలు అందుకున్నారు. 1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ అవార్డు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఆయనకు 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో దేశ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న జాకీర్ హుస్సేన్, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో మూడు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకున్నారు. భారతీయ సంగీతాన్ని ప్రపంచస్థాయిలో ప్రాచుర్యం చేసిన ఆయన ఎన్నో అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. జాకీర్ హుస్సేన్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సంగీతాభిమానులు భావిస్తున్నారు.






