దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కొనసాగుతోంది. ప్రస్తుతం భాజపా (BJP) స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. 70 స్థానాలకు గాను భాజపా 43 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 27 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ (INC) ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది.
ప్రముఖ అభ్యర్థుల పోరు
ఈసారి ఎన్నో కీలక పోరులు జరుగుతున్నాయి. ముఖ్యంగా న్యూదిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ భాజపా అభ్యర్థి పర్వేశ్ వర్మకు స్వల్పంగా వెనుకబడి ఉన్నారు. కాల్‌కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్న దిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజలో ఉండగా, జంగ్‌పురలో మనీశ్ సిసోడియా ముందంజలో ఉన్నారు. షాకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ వెనుకబడి ఉండగా, ఓక్లాలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ముందంజలో ఉన్నారు. ఇక, గాంధీనగర్‌లో భాజపా అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ లీడ్‌లో ఉండగా, బద్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ వెనుకబడ్డారు. బిజ్వాసన్‌లో భాజపా అభ్యర్థి కైలాష్ గహ్లోత్ ముందంజలో ఉండగా, పత్‌పర్‌గంజ్‌లో ఆప్ అభ్యర్థి అవధ్ ఓజా వెనుకంజలో ఉన్నారు. గ్రేటర్ కైలాష్ స్థానంలో ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ వెనుకబడి ఉన్నారు. ఈ ఫలితాలతో దిల్లీ రాజకీయాల్లో భాజపా మళ్లీ పుంజుకుంటుందా? ఆప్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.





