ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే తీవ్రస్థాయిలో స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహం, అవినీతి వల్లే ఓటమిని చవిచూశారని వ్యాఖ్యానించారు. ప్రజలు అతనిపై విశ్వాసం కోల్పోయారని, డబ్బు, అధికార దుర్వినియోగం కారణంగా ఆయన పరాజయం పాలయ్యారని తెలిపారు. అన్నాహజారే మాట్లాడుతూ, గతంలో కేజ్రీవాల్‌తో కలిసి రాంలీలా మైదాన్‌లో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టయ్యిన సమయంలోనూ ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డానని తెలిపారు.
బీజేపీ ప్రభంజనం
ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. 50కి పైగా సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, ఔటర్ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీలో ఆప్ పూర్తిగా బోర్లా పడింది. అవినీతి ఆరోపణల కారణంగా ఆప్ నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా లాంటి అగ్రనేతలు జైలుకు వెళ్లిన నేపథ్యంలో పలువురు ఆప్ నేతలు బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీకే విజయావకాశాలు పెరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ సీఎం అధికార నివాస నిర్మాణంలో అవినీతి, లిక్కర్ స్కాం ఆరోపణలు ఆప్ ప్రతిష్ఠను పూర్తిగా దెబ్బతీశాయి.





