2008 డీఎస్సీ అభ్యర్థులు తమకు ఉద్యోగ పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట ధర్నాకు దిగారు. 1399మంది అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు జీవో నెంబర్ 9 తీసుకొచ్చి, కేబినెట్ అప్రూవల్ కూడా పూర్తి చేసినప్పటికీ, ఏడాది గడిచినా ఇప్పటివరకు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రెండోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్స్ సర్టిఫికెట్లు తీసుకున్న నాలుగు నెలలు గడిచిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒరిజినల్స్ లేక ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంపై ఆధారపడలేక ఆత్మహత్య చేసుకునే ఆలోచన కూడా వస్తోందని భావోద్వేగంతో తెలిపారు.
ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి
‘‘మాకు ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టింగ్లు వెంటనే ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలి. మరింత ఆలస్యం చేస్తే మేము దిక్కులేని పరిస్థితిలో పడిపోతాం,’’ అని వేడుకుంటున్నారు.‘మాకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వకపోతే.. తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని మా సమస్యలు పరిష్కరించాలి,’’ అని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.










