రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా మార్చి చివరి నుంచి లేదా ఏప్రిల్‌లో చూపించే ఎండలు ఇప్పటి నుంచే భయపెడుతున్నాయి. ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో భూతాపం ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఈ ఏడాది తీవ్రమైన వేడి అలజడి ఉంటుందని అంచనా వేసింది. గతేడాది (2024) ప్రపంచంలో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించగా, ఈ ఏడాది కూడా దాని తరహాలోనే ఉండే అవకాశముందని హెచ్చరిస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే చలితగ్గిపోయి, రెండు వారాల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. మంగళవారం తుని, నరసాపురం, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, బాపట్ల, కావలి, కర్నూలు తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. దీంతో ఉక్కపోత తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశముంది.
భూతాప ప్రభావం పెరుగుతుందా?
గత పదేళ్లలో (2015-2024) భూతాపం ప్రభావం అత్యధికంగా నమోదైంది. ఈ కాలంలో ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో వేడి పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. సాధారణంగా సముద్రాలు 30% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించాల్సి ఉంటే, సముద్ర కాలుష్యం వల్ల ఆ ప్రక్రియ మందగిస్తోంది. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం, బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగం పెరగడం కూడా భూతాపానికి దోహదం చేస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో వడగాలుల తీవ్రత అధికమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచే రాష్ట్రంలో వడగాలులు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.





