- 20.10 లక్షల కనెక్షన్లకు సౌర పలకలు
- 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు అదనపు ఆదాయం
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చెందిన 20.10 లక్షల ఇళ్లపై ఉచితంగా 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులపై ఆర్థిక భారం పడకుండా లీజు రూపేణా ప్రతి నెలా కొంత మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకు సంబంధించిన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసి, కేంద్రం ఆమోదం కూడా పొందింది. జిల్లాల వారీగా గుత్తేదారులను ఎంపిక చేసి టెండర్లు పిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,412 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా.
ఉచిత విద్యుత్‌తో పాటు అదనపు ఆదాయం
ప్రతి ఇంటిపై 2 కిలోవాట్ల సౌర ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి రూ.1.15 లక్షల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో రూ.60 వేలు కేంద్రం రాయితీగా అందించగా, మిగిలిన రూ.55 వేల వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇప్పటికే నెలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తోంది. అదనంగా, ఇంటి పైకప్పును వినియోగించుకున్నందుకు చదరపు అడుగుకు రూ.1 చొప్పున లీజు చెల్లించనుంది. దీని ద్వారా లబ్ధిదారులకు నెలకు రూ.200 అదనపు ఆదాయం లభిస్తుంది. ఇంటి పైకప్పు అనుకూలంగా లేకుంటే ప్రభుత్వ ఖాళీ భూముల్లో ఈ సౌర ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది.





