గోవాలో విషాదం: డాన్స్ ఫ్లోర్‌పై మంటలు.. 25 మంది మృతి!

గోవా నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం – డాన్స్ ఫ్లోర్‌పై మంటలు, 25 మంది ప్రాణాలు కోల్పోయారు

గోవా పర్యాటక చరిత్రలో ఆదివారం రాత్రి ఓ భయానక అధ్యాయం చేరింది. నార్త్ గోవాలోని ఆర్పోరా గ్రామంలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో అర్ధరాత్రి తర్వాత మంటలు చెలరేగాయి. సెకన్లలోనే డాన్స్ ఫ్లోర్‌ ఆనందం హాహాకారంగా మారింది. ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. సిలిండర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

క్షణాల్లో మారిపోయిన వేదిక

ప్రమాదం జరిగే సమయంలో క్లబ్‌లో సుమారు 100 మంది పర్యాటకులు ‘బాలీవుడ్ బ్యాంగర్ నైట్’లో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. ‘మెహబూబా ఓ మెహబూబా’ పాటతో ఫ్లోర్ కదులుతుండగా, ఒక్కసారిగా కిచెన్‌ వైపు మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని సెకన్లలోనే పొగ క్లబ్ మొత్తం కమ్మేసింది. వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాలు హృదయ విదారకం మంటలు వ్యాపిస్తున్నా, కొందరు ఇంకా డ్యాన్స్‌ కొనసాగిస్తున్నారు. తరువాత వచ్చిన కేకలు, పరుగులు, ఆందోళన… అన్నీ కలగలిపి గందరగోళం.

గోవా నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం – డాన్స్ ఫ్లోర్‌పై మంటలు, 25 మంది ప్రాణాలు కోల్పోయారు

సిబ్బందే ఎక్కువగా బలైనవారు

గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు కాలిపోయి చనిపోయారు, మిగతా వారు దట్టమైన పొగతో ఊపిరి ఆడక మరణించారు. పొగ వ్యాపించడంతో చాలామంది బేస్‌మెంట్ వైపు పరుగెత్తారు. అక్కడ వెంటిలేషన్ లేకపోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల బయటకు రాలేకపోయారు.
మృతుల్లో ఎక్కువ మంది జార్ఖండ్, అస్సాం ప్రాంతాల కార్మికులే.. వారు క్లబ్‌లో వంట మనుషులు, హెల్పర్లు, టెక్నీషియన్లుగా పనిచేస్తున్నవారు. వారి కుటుంబాలు గోవా ఆసుపత్రి మార్చురీ వద్ద కన్నీరుమున్నీరుగా ఎదురుచూస్తున్నారు.

యజమాని కోసం గాలింపు, విచారణ ప్రారంభం

ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ఘటనను గోవా చరిత్రలో అత్యంత దురదృష్టకరమైనదిగా పేర్కొన్నారు.
నైట్‌క్లబ్ జనరల్ మేనేజర్ అరెస్టయ్యాడు. యజమాని పరారీలో ఉన్నాడు — పోలీసులు వారెంట్ జారీ చేశారు.
ప్రభుత్వం మాజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించారని ప్రాథమిక సమాచారం. “అనుమతులు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తప్పవు,” అని సీఎం హెచ్చరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నిధుల నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పోలీసుల ప్రకారం, అన్ని మృతదేహాల గుర్తింపు పూర్తి అయిన తర్వాతే కుటుంబాలకు అప్పగిస్తారు.

హెల్ప్‌లైన్ నంబర్లు ..

గోవా ప్రభుత్వం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసింది —
నార్త్ గోవా కలెక్టరేట్: 0832-2225383
పోలీసు కంట్రోల్ రూమ్: 7875756000
బర్డేజ్-I ఆఫీసర్: 8308014526
బర్డేజ్-II ఆఫీసర్: 7083234963
తిస్వాడి జిల్లా: 9421151048

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *