- గూగుల్ కొత్తగా ఏఐ ఆధారిత ‘పర్సనల్ హెల్త్ కోచ్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
- ఫిట్‌బిట్, పిక్సెల్ వాచ్ వాడేవారికి ఇది అందుబాటులోకి వస్తుంది.
- ఇది వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్‌గా, నిద్ర కోచ్‌గా పనిచేస్తుంది.
మీరు ఫిట్నెస్ విషయంలో తరచుగా గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. గూగుల్ తన సరికొత్త ఏఐ ఆధారిత ‘పర్సనల్ హెల్త్ కోచ్’ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇది జెమిని టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఫీచర్ ఒక ఫిట్నెస్ ట్రైనర్‌గా, నిద్ర కోచ్‌గా, ఇంకా వెల్నెస్ అడ్వైజర్‌గా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ అక్టోబర్‌లో ఫిట్‌బిట్ ప్రీమియం వాడే వారికి అప్డేటెడ్ యాప్ ద్వారా లభిస్తుంది.
మీ ఆరోగ్యం మీ చేతుల్లో..
ఈ ఏఐ కోచ్ మీ అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తుంది. మీ ఫిట్‌బిట్ లేదా పిక్సెల్ వాచ్ నుంచి వచ్చే నిజ-సమయ డేటాను పరిశీలిస్తుంది. అంతేకాదు, స్మార్ట్ వెయిట్ స్కేల్ లేదా గ్లూకోజ్ మానిటర్ నుంచి వచ్చే సమాచారాన్ని కూడా తీసుకుని మీ ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన పెంచుకుంటుంది. ఇది మీ లక్ష్యాలు, ప్రాధాన్యతలు, మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ను బట్టి ఒక పర్సనల్ ఫిట్నెస్ ప్లాన్‌ను రూపొందిస్తుంది. ఇందులో మీకు అనుకూలంగా ఉండే వర్కౌట్ సూచనలు, టార్గెట్లు ఉంటాయి.
రియల్ టైమ్ డేటా..
మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు, ఈ ఏఐ కోచ్ మీరు సాధించిన లక్ష్యాలను బట్టి ప్లాన్‌ను మారుస్తుంది. ఉదాహరణకు, ఒకరోజు నిద్ర సరిపోక మీరు నిస్సత్తువగా ఉన్నారని గుర్తిస్తే, అది ఆ రోజు ప్లాన్‌ను మార్చి, రికవరీకి తగిన సూచనలు ఇస్తుంది. మీ రోజువారీ పనుల వల్ల ఫిట్నెస్ ప్లాన్ దెబ్బతింటే, మీరు ఏఐ కోచ్‌తో మాట్లాడి దానికి తగిన మార్పులు చేసుకోవచ్చు.
మెరుగైన నిద్ర కోసం..
ఫిట్నెస్తో పాటు, ఈ ఏఐ కోచ్ మీ నిద్ర విధానాన్ని కూడా విశ్లేషిస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుకోవడానికి చిట్కాలు ఇస్తుంది. ఈ ఏఐ కోచ్ మెరుగైన ఆల్గరిథమ్ల సహాయంతో మీ నిద్ర సమయం, దశలను అర్థం చేసుకుంటుంది. అలాగే, మీ రోజువారీ పనులకు తగ్గట్టుగా ఒక వ్యక్తిగత నిద్ర షెడ్యూల్‌ను కూడా రూపొందిస్తుంది. ఈ కొత్త ఏఐ కోచ్‌ను కొత్తగా డిజైన్ చేసిన ఫిట్‌బిట్ యాప్‌లో పొందుపరిచారు. ఈ యాప్‌లో డేటా విజువలైజేషన్, ఇంప్రూవ్డ్ సింకింగ్ వంటివి ఉంటాయి. మీరు ఆరోగ్యానికి సంబంధించిన ఏ ప్రశ్నలు అడిగినా.. ఈ ఏఐ కోచ్ సరైన సమాధానాలు ఇస్తుంది.





