- రాష్ట్రంలోని 300 గ్రామాల్లో భూగర్భ జలాలు రీఛార్జ్ కంటే అధికంగా వినియోగం.
- నీటి దుర్వినియోగం నియంత్రణకు కఠినంగా వాల్టా చట్టం అమలు.
రాష్ట్రంలోని 2,617 గ్రామాల్లో భూగర్భ జలాల వినియోగం నియంత్రణను కోల్పోయింది. వాటిలో 300 గ్రామాల్లో మరీ దారుణంగా నీటిని తోడేస్తున్నట్లు కేంద్ర భూగర్భ జలవనరుల శాఖ అధ్యయనంలో వెల్లడైంది. ప్రకాశం, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరం. ఈ గ్రామాల్లో భూగర్భ జలాలు రీఛార్జ్ అయిన పరిమాణాన్ని మించిపోయి వినియోగించటం తీవ్ర ప్రభావాన్ని మిగల్చుతోందని నివేదిక చెబుతోంది.
ఈ సమస్యను నియంత్రించేందుకు ప్రభుత్వం వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరిన గ్రామాల్లో కొత్తగా వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం బోర్లు తవ్వేందుకు అనుమతులు ఉండవు. తాగునీటి అవసరాలకే పరిమితంగా బోర్లు వేయడానికి అనుమతించనున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులను పరిశీలించకుండానే తిరస్కరించనున్నారు. విద్యుత్ సంస్థలు కొత్త కనెక్షన్లు ఇవ్వకుండా నియంత్రణ విధించనున్నాయి. భూగర్భ జలాల పెంపు, రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, అటవీ, నీటి సరఫరా విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది.





