తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులకు చదువు వరం కావాలి అనే ఆశయంతో ‘హీల్ ఫౌండేషన్’ స్థాపించిన పాఠశాల హీల్ ప్యారడైజ్. ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 90 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లిన ఈ విద్యాసంస్థ, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తోంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికతో బోధన కొనసాగుతోంది. విద్యతో పాటు వసతి, భోజనం, ఆరోగ్య పరిరక్షణను కూడా పూర్తి స్థాయిలో సమకూరుస్తోంది.
నాణ్యమైన విద్య, ప్రథమ శ్రేణి సదుపాయాలు
విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచేలా హీల్ ప్యారడైజ్‌లో అన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 15,000 పుస్తకాలతో పెద్ద గ్రంథాలయం, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. కళలను ప్రోత్సహించేలా త్రీడీ చిత్రలేఖనం, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం వంటి కోర్సులు అందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్, బాస్కెట్‌బాల్, ఖో-ఖో, వాలీబాల్, హ్యాండ్‌బాల్ మైదానాలు ఉన్నాయంటే, ఇక్కడి విద్యార్థులకు క్రీడా రంగంలో అభివృద్ధికి ఎలాంటి అవరోధం లేదని చెప్పొచ్చు. ఆహార విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విద్యార్థులకు సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో భోజనం అందిస్తున్నారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి, వేడినీరు సౌకర్యం కల్పించారు. బాలురు, బాలికలకు వేర్వేరు హాస్టల్‌లు ఏర్పాటు చేసి, అధునాతన వసతి సదుపాయాలను సమకూర్చారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం పాఠశాల ప్రాంగణంలోనే ఆసుపత్రిని అందుబాటులో ఉంచారు.
2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం
తల్లి లేదా తండ్రి లేక చదువుకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్న నిరుపేద విద్యార్థులకు ఈ పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కొత్త విద్యార్థుల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఒకసారి ప్రవేశం పొందిన విద్యార్థులు పదోతరగతి వరకు ఇక్కడే చదువుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి హీల్ ప్యారడైజ్ ప్రాంగణంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు.హీల్ పాఠశాలలో చేరాలంటే తల్లి లేదా తండ్రి మరణ ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 18. ఆసక్తి ఉన్నవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హీల్ సంస్థ ద్వారా విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తమ లక్ష్యమని, ఈ సంస్థ కార్యదర్శి తాతినేని లక్ష్మి, సీఈఓ కె.అజయ్‌కుమార్ తెలిపారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : 9100024435, 9100024438





