టెక్ టాక్: సీక్రెట్ కెమెరాలా? మీరే ఏజెంట్ లా పట్టేయండి!!

టెక్నాలజీ ఎన్నో రకాలుగా మారింది. ఇకపై మరింత విప్లవాత్మకంగా మారుతుంది కూడా. ఇదంతా దేనికంటే? సింపుల్.. మనిషి సౌకర్యంగా.. సురక్షితంగా మనుగడ సాగించేందుకే. కానీ, మన చుట్టూ జరుగుతున్న సంఘటల్ని గమనిస్తే టెక్నాలజీ కారణంగా మంచి కంటే.. చెడే ఎక్కువగా వినిపిస్తోంది. చుట్టూ చోటు చేసుకుంటున్న సంఘటనల్ని చూస్తుంటే టెక్నాలజీ మనిషి పైశాచిక ఆనందాలకు వేదిక అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎక్కడ చూసినా అనేక దాడులు.. ఫిజికల్ గా అనుకునేరు.. నేటి ఆధునిక టెక్నాలజీ ముసుగులోనే. ముఖ్యంగా అమ్మాయిలపైనే ఈ బ్లాక్ మెయిల్ దాడులు జరుగుతున్నాయి.  మోసపూరితమైన ఈ పైశాచిక దాడులకు పాచికలుగా మారుతున్నాయ్ సీక్రెట్ కెమెరాలు.  మనిషి రక్షణకై.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి శోధించిన కనిపెట్టిన సీక్రెట్ కెమెరాలు.. నేడు ఎంతో మంది అమ్మాయిలకు నిద్ర లేకుండా చేస్తున్నాయ్. 

షాపింగ్ మాల్స్, హోటళ్లు, కాలేజీలు, ఆఫీస్ సహా మనం ఉండే ఇంటి బయట, చుట్టూ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవన్నీ భద్రతాపరంగా మనకు రక్షణ కల్పిస్తాయన్నది వాస్తవం. అయితే.. ఇదే క్రమంలో.. కొందరు నేరగాళ్లు స్పై కెమెరాలు ఏర్పాటుచేసి, ఇతరులకు తెలియకుండా వీడియోలు తీస్తుంటారు. తరువాత వారిని బెదిరించి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. కొద్దిరోజుల క్రితం ఓ ఇంజినీరింగ్ కాలేజీ, తెలంగాణలోని ఓ హోటల్‌లో హిడెన్ కెమెరాల ఘటనలపై ఇటీవల పెద్ద దుమారమే రేగింది. ఇలాంటి ఘటనల్ని చూస్తుంటే నిఘా కెమెరాల విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి.  ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్ సీఆర్ బీ) లెక్కల ప్రకారం గత ఏడాదితో పోల్చితే స్పై కెమేరా కేసులు ఈ ఏడాది 23 శాతం పెరిగాయట. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే. యూజర్ల తమ ప్రైవసీని కాపాడుకోవడాన్ని విధిగా అలవాటు చేసుకోవాలి.  అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. 

ప్రాథమిక పరిశీలన.. 
గదిలోని ప్రతి మూల జాగ్రత్తగా పరిశీలించండి.   సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని అనుమానం వస్తే మీ పరిసరాలను భౌతికంగా పరిశీలించడం మంచిది. అసాధారణంగా అనిపించే ఏవైనా వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా గడియారాలు, స్మోక్ డిటెక్టర్‌లు,  USB ఛార్జింగ్ బ్లాక్‌లను సాధారణంగా సీక్రెట్ కెమెరాలకు వినియోగిస్తారు. ఏదైనా సందేహం వస్తే.. ఆ పరికరాన్ని అన్‌ప్లగ్ చేయండి. అవి బ్యాటరీతో పనిచేసేవి అయితే బ్యాటరీ తీసివేయండి. సీక్రెట్ కెమెరాలు చీకట్లో కూడా పనిచేసేందుకు వీలుగా, వాటికి ఇన్‌ఫ్రారెడ్, LEDs ఉంటాయి. ఆ కెమెరాలను కనిపెట్టేందుకు ముందు గదిలో లైట్లు ఆఫ్ చేయండి. కర్టెన్లను మూసేసి, గదిని వీలైనంత చీకటిగా మార్చండి. తర్వాత మొబైల్ కెమెరా ఆన్ చేసి, గది మొత్తాన్ని స్కాన్ చేయండి. మొబైల్ కెమెరా దేనినైనా ఫోకస్ చేసిందంటే, అక్కడ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఉన్నట్లే లెక్క. దాన్ని క్షుణ్నంగా పరిశీలించండి.

ఫ్లాష్ లైట్ ని వాడొచ్చు 
కొన్ని సందర్భాల్లో ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించడం కూడా సీక్రెట్ కెమెరాలను గుర్తించడంలో సహాయపడుతుంది. గదిని పూర్తిగా చీకటిగా చేయాలి. సెల్‌ఫోన్‌లో ఫ్లాష్‌ లైట్ ఆన్ చేయండి. గది చుట్టూ ఫ్లాష్‌లైట్‌తో తిప్పండి. ఏదైనా చిన్నగా నీలం లేదా ఊదా రంగులో మెరుస్తున్నట్లు గా కనిపించవచ్చు. మినీ కెమెరా లెన్స్ నుండి ఆ లైట్ రావొచ్చు. వాటిని గుర్తించి జాగ్రత్త పడండి.

యాప్ ల సాయం తీసుకోండి.. 
అనేక రకాల రహస్య కెమెరాలు ఉపయోగంలో ఉన్నప్పుడు కాంతిని విడుదల చేస్తాయి. మీరు దీన్ని స్వయంగా చూడలేరు. ఇందుకోసం మీ స్మార్ట్‌ఫోన్ సహాయం చేయగలదు. చాలా సందర్భాలలో వెనక వైపున ఉన్న కెమెరాలు ఇన్‌ఫ్రారెడ్ ఫిల్టర్‌లను కలిగి ఉంటాయి. మీ గదిని వీలైనంత చీకటిగా ఉంచాలి. గదిని స్కాన్ చేయడానికి మీ ఫోన్ కెమెరాను ఉపయోగించండి. అంతే కాకుండా.. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్‌లు చాలానే ఉన్నాయి. ఇవి సీక్రెట్‌ కెమెరాలను స్కాన్ చేసి ఈజీగా కనిపెట్టేస్తాయి. కనుక ఈ యాప్లను డౌన్‌లోడ్ చేసుకొని, ఓపెన్ చేస్తే, ఆటోమేటిక్‌గా అది ఫోన్ కెమెరాని ఉపయోగించుకొని, రహస్య కెమెరాలు ఎక్కడ ఉన్నాయో ఈజీగా పసిగట్టేస్తాయి.

వైఫై స్కానింగ్.. 
స్పై కెమెరాలు వైఫె నెట్‌వర్క్‌తో పనిచేస్తూ ఉంటాయి. ఇవి రికార్డ్ చేసిన వీడియోని వైఫై ద్వారా ట్రాన్స్‌మిట్ చేస్తూ ఉంటాయి. అందువల్ల మీరు గదిలోకి వెళ్లాక, అక్కడ వైఫై నెట్‌వర్క్స్ ఏమైనా ఉన్నాయో, లేదో గమనించండి. ఇందుకోసం మీరు WiFiman, NetSpot, Fing లాంటి నెట్‌వర్క్ స్కానర్ యాప్స్ కూడా ఉపయోగించవచ్చు. ఈ యాప్స్‌ ద్వారా మీకు ఏదైనా అనుమానాస్పదమైన నెట్‌వర్క్ కనిపిస్తే, దానిపై హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయండి. వాళ్ల స్పందించకపోతే పోలీసులకు రిపోర్ట్ చేయండి.

‘డిటెక్టర్ల’ను ప్రయత్నించొచ్చు
ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి ఇది ఉపయుక్తం. ‘ఆర్ ఎఫ్ డిటెక్టర్లను వాడొచ్చు. గది మొత్తాన్ని డిటెక్టర్ తో స్కాన్ చేయడం ద్వారా వైర్ లెస్ సిగ్నల్స్ కనిపెట్టొచ్చు. దీంతో రహస్య కెమెరాల్ని కనిపెట్టడడం చాలా సులభం. సీక్రెట్ కెమెరా డిటెక్టర్ యాప్‌లను ప్రయత్నించొచ్చు. కానీ, వాటి పని తీరుపై చాలా సందేహాలు ఉన్నాయి.  అవి వంద శాతం కచ్చితంగా పనిచేస్తాయని చెప్పలేం.

మిర్రర్ చెక్ ఇలా!
మీరు స్టే చేసిన గదుల్లోగానీ.. షామింగ్ మాల్స్ లోని మిర్రర్లను గానీ.. చెక్ చేయడానికి మీ వేలిని అద్దానికి ఆనించండి.  మీ వేలికి, అద్దం కి మధ్య ఎలాంటి స్పేస్ లేకపోతే అనుమానించాలి. వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి. 

శబ్దాలేమైనా వచ్చినా!!
గది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏమైనా చీప్ సౌండ్స్, క్లిక్ చేసినట్టుగా ఏమైనా శబ్దాల్ని గమనిస్తే.. వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే.. కొన్ని రకాల హిడెన్ కెమెరాల నుంచి అలాంటి సౌండ్స్ వస్తాయి. 

ఇలా స్పై కెమెరాలకు చిక్కిన వారిలో ఎక్కువ శాతం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.  రికార్డు చేసిన  వీడియోలు, ఫొటోలు ఎవరు చూశారు? వైరల్ అవుతాయేమో? నెట్లో పెడతారేమో?.. అని భయాందోళనలకు గురవుతున్నారు. దీన్నే ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిస్ ఆర్డర్’ అని మానసిక నిపుణులు చెబుతున్నారు.  ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్న బాధితులు కచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకోవాలి. అంతేకాదు.. ఫ్యామిలి సపోర్ట్ తీసుకుని ధైర్యంగా ముందుకు సాగాలి.  కట్టుదిట్టమైన సైబర్ చట్టాల సాయంతో నేరస్తులకు శిక్షలు పడేలా చేయొచ్చు. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఈ సీక్రెట్ కెమెరాలతో అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు తీసే ప్రయత్నం చేస్తే.. వెంటనే సైబర్ పోలీసుల్ని సంప్రదించండి. 

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *