హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) ప్రస్తుతం చైనాలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తి భారత్‌లోనూ మొదలైంది. బెంగళూరులో ఓ ఎనిమిది నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారికి బాప్టిస్ట్ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. కర్ణాటక ఆరోగ్య శాఖ, ప్రభుత్వ ల్యాబ్‌లో ఆ చిన్నారి నమూనాను పరీక్షించలేదని పేర్కొంది. అయితే, ప్రైవేట్ ఆసుపత్రి నివేదికను అనుమానించడానికి ఎటువంటి కారణం లేదని తెలిపింది. 2001లో మొదటిసారి ఈ వైరస్ ని గుర్తించారు. దీనికి ఇంకా ప్రత్యేక యాంటీవైరల్ చికిత్స లేదా వ్యాక్సిన్ లేదు. కొత్త వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ, “శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి,” అని సూచించారు.





