- నేరస్థులకు 100 రోజుల్లో శిక్ష పడేలా పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు.
- మహిళల రక్షణకు ప్రత్యేక వింగ్, యాప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
హోం మంత్రి వంగలపూడి అనిత నేరస్థులకు 100 రోజుల్లో శిక్ష పడేలా పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని ప్రకటించారు. ప్రస్తుతం కొత్తగా 394 ఎస్సైలు విధులు చేపట్టగా, మరి కొద్దిరోజుల్లో ఆరువేల మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామకం పూర్తి కానుందన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక వింగ్, యాప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతపురం పోలీస్ శిక్షణ కేంద్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసుల పరేడ్‌ను తిలకించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. మొత్తం 394 మంది ఎస్సైలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 300 సివిల్, 94 మంది ఏపీఎస్పీ సబ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. సివిల్ ఎస్సై శిక్షణ పొందిన వారిలో 97 మంది మహిళలు.
గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం
గంజాయి ఒక తరాన్ని నాశనం చేస్తుందని అనిత అన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష కిలోలకు పైగా గంజాయిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలపై కూడా ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.





