- గురుత్వాకర్షణ లేమితో ఎముకలు, కండరాల బలహీనత
- భూమికి తిరిగి వచ్చిన తర్వాత నిలకడ, నడక, చూపు సమస్యలు
- రోదసిలో గుండె, మెదడు, రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం
అంతరిక్షంలో దీర్ఘకాలం గడిపిన వ్యోమగాములు భూమికి తిరిగొచ్చాక గురుత్వాకర్షణకు అలవాటు పడే వరకు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. రోదసిలో ఉన్నప్పుడు భారరహిత స్థితి వల్ల శరీర వ్యవస్థలు మారిపోతాయి. భూమికి రాగానే గురుత్వాకర్షణ ప్రభావాన్ని మళ్లీ అర్థం చేసుకోవడానికి వారికొంత సమయం పడుతుంది.
ఎముకలు, కండరాల బలహీనత
రోదసిలో ఎముక కణజాలం క్షీణించడం వల్ల వ్యోమగాములు సంవత్సరానికి 10% వరకు ఎముక సాంద్రత కోల్పోతారు. కండరాలు పని చేయాల్సిన అవసరం లేకపోవడంతో బలహీనపడతాయి. వ్యోమగాములు రోజూ కనీసం 2 గంటలపాటు కఠినమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. రోదసిలో వెస్టిబ్యులర్ వ్యవస్థ మారిపోవడం వల్ల భూమిపై తిరిగి నడవడం, నిలబడటం కష్టమవుతుంది. దీనివల్ల ‘గ్రావిటీ సిక్‌నెస్’ ఏర్పడి తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. రోదసిలో ఎక్కువగా గడిపిన వారు భూమిపై తిరిగి మాట్లాడే తీరును కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
రోదసిలో గుండె, రక్తప్రసరణ మార్పులు
- రోదసిలో గుండె ఆకృతి మారుతుంది, రక్తనాళాలు కుంచించుకుపోతాయి.
- తల భాగంలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల దృష్టి సమస్యలు ఏర్పడతాయి.
- రేడియేషన్ అధికంగా ఉన్నందున వ్యోమగాముల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి, క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
సమయం పట్టే మార్పులు
భూమికి తిరిగొచ్చాక వ్యోమగాములకు నాలుగేళ్ల వరకు ఎముకల సాంద్రత తిరిగి సాధారణ స్థాయికి రాదు. వినికిడి, చూపు, నడక సమస్యలు నెలలపాటు కొనసాగొచ్చు. కొందరికి ‘బేబీ ఫీట్’ సమస్య ఏర్పడి పాదాల చర్మం చాలా మృదువుగా మారి నడవడం కష్టమవుతుంది. రోదసిలో గడిపిన అనుభవాన్ని మర్చిపోకుండా, భూమికి తిరిగి వచ్చాక మానవ శరీరం ఎలా మారుతుందో విశ్లేషించేందుకు శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు.





