హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్) ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఒకవైపు ప్రయాణికులు లేరని వాపోతుండగా, మరోవైపు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణికులను స్టేషన్లలోకి కూడా రాకుండా అడ్డుకుంటుంది. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో రాయదుర్గం ఒకటి. ఇక్కడ వేల మంది ఐటీ ఉద్యోగులు నిత్యం ప్రయాణాలు చేస్తుంటారు. అయితే, ఈ స్టేషన్‌లో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత నెల 26న భారీ వర్షం పడుతుండగా, ఇళ్లకు వెళ్లేందుకు ఉద్యోగులు స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే ప్లాట్‌ఫారాలు, స్టేషన్‌లోని ఇతర ప్రాంతాలు ప్రయాణికులతో నిండిపోయాయి. దీనితో సిబ్బంది కొత్తగా వస్తున్న ప్రయాణికులను రోడ్డుపైనే నిలిపివేశారు. వర్షం పడుతున్నా కనికరం లేకుండా బయటే నిలబెట్టడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మెట్ల మీద అయినా నిలబడతాం అని బతిమాలినా సిబ్బంది అనుమతించలేదు. దీనితో ప్రయాణికులకు, మెట్రో సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. స్టేషన్‌లో నిలబడటానికి కూడా చోటు లేకపోవడంతో ప్రయాణికులు మెట్రో నిర్వహణపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
పార్కింగ్ సమస్య
రాయదుర్గం టర్మినల్ స్టేషన్ సమీపంలో ప్రభుత్వం మెట్రో కోసం 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇక్కడ పార్కింగ్ సదుపాయం కల్పించాల్సి ఉన్నా, ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ ఆ స్థలాన్ని మూడో పార్టీకి లీజుకు ఇచ్చి భారీగా డబ్బు సంపాదించింది. ప్రయాణికుల పార్కింగ్ సమస్యను పట్టించుకోలేదు. దీనితో వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియని పరిస్థితి ప్రయాణికులది. మెట్రో అధికారులు తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.





