- గువాహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఇంధనం తక్కువగా ఉందని పైలట్ ‘మేడే’ ప్రకటించారు. దీంతో విమానం బెంగళూరులో సురక్షితంగా అత్యవసరంగా దిగింది.. ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించారు.
గువాహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం (6E-6764)లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విమానంలో ఇంధనం ప్రమాదకరంగా తక్కువగా ఉండటంతో పైలట్ ‘మేడే’ (అత్యవసర పరిస్థితి) అలర్ట్ ఇచ్చారు. దీంతో, 168 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన గురువారం జరగగా, ఈ విమానానికి చెందిన ఇద్దరు పైలట్లను విధుల నుంచి తొలగించారు. వారం రోజుల క్రితం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటన మరువకముందే ఈ సంఘటన జరగడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
చెన్నైలో ల్యాండింగ్‌కు నో చెప్పడంతో బెంగళూరుకు దారి మళ్లింపు
గురువారం సాయంత్రం 4:40 గంటలకు గువాహటి నుంచి బయలుదేరిన ఈ విమానం, రాత్రి 7:45 గంటల ప్రాంతంలో చెన్నైలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, చెన్నై విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ల్యాండింగ్‌కు అనుమతి లభించలేదు. దీంతో పైలట్ ‘గో-అరౌండ్’ (ల్యాండింగ్ ప్రయత్నాన్ని రద్దు చేసి మళ్ళీ పైకి వెళ్ళడం) చేయాల్సి వచ్చింది. సరిపడా ఇంధనం లేకపోవడంతో, పైలట్ ‘మేడే’ కాల్‌తో బెంగళూరు వైపు విమానాన్ని మళ్లించారు. ‘మేడే’ అలర్ట్ రాగానే బెంగళూరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక, వైద్య సిబ్బందితో సహా అత్యవసర బృందాలను సిద్ధం చేశారు. రాత్రి 8:20 గంటలకు విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
కాగా, శుక్రవారం కూడా మధురై వెళ్తున్న మరో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో, ఆ విమానం చెన్నైకి తిరిగి వచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయింది. సుమారు 68 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానంలో అందరూ సురక్షితంగా కిందకు దిగారు. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.





