అదృష్టాన్ని నమ్ముకుంటే కలలు సాకారం కావు. కృషి, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. ఎన్నో కష్టాలను ఓర్చుకుని, ఆత్మవిశ్వాసంతో విజయతీరాలకు చేరుకున్నవారిలో హర్యానాకు చెందిన పూజా యాదవ్ ఒకరు. తన జీవితంలో బిగ్ డ్రీమ్‌ను నిజం చేసుకోవాలనే సంకల్పంతో ఊహించని సాహసం చేసింది.
ఐపీఎస్ కల కోసం ఉన్నత ఉద్యోగాలకు స్వస్తి
1998లో హర్యానాలోని సోనిపట్‌లో జన్మించిన పూజా యాదవ్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. విద్యలో ప్రతిభ చూపుతూ బయోటెక్నాలజీలో బీటెక్, ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేసింది. కెనడా, జర్మనీ లాంటి దేశాల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు చేసింది. కానీ, ఆమె మనసు ఎప్పుడూ సివిల్ సర్వీసెస్ వైపే నిలిచింది. దేశానికి సేవ చేయాలనే కోరికతో సడన్‌గా ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టింది. సివిల్స్ ప్రిపరేషన్ అనుకున్నంత సులభం కాదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రతిబంధకంగా మారింది. చదువుకోసం అయ్యే ఖర్చులను భరించేందుకు ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టింది. రోజుకు గంటల తరబడి కష్టపడుతూ UPSCని విజయం సాధించింది. 2018లో ఐపీఎస్ అధికారిణిగా ఎంపికై, 2020లో కర్ణాటక క్యాడర్‌లో నియమితురాలైంది. సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ఉన్నత ఉద్యోగాలను వదులుకుని, ఎన్నో అడ్డంకులను అధిగమించి ఐపీఎస్‌గా ఎదిగిన పూజా యాదవ్ యువతకు గొప్ప స్ఫూర్తిదాయకం.





