- జూన్ 13 నుంచి ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోంది.
- ఈ పోరులో ఇరాన్‌లో ఇప్పటికే 430 మందికి పైగా చనిపోగా, 3,500 మంది గాయపడ్డారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గతవారం జూన్ 13న ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య మొదలైన పోరు తీవ్రరూపం దాలుస్తోంది. ఇరాన్ అధికారిక లెక్కల ప్రకారం, ఈ యుద్ధంలో ఇప్పటివరకు కనీసం 430 మంది ప్రాణాలు కోల్పోగా, 3,500 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై దాడులు చేయగా, ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్‌లతో ప్రతీకార దాడులకు దిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా జోక్యంపై హెచ్చరికలు
ఈ యుద్ధం మధ్య, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి అమెరికాకు ఒక కీలక హెచ్చరిక చేశారు. ఈ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే “అందరికీ చాలా ప్రమాదకరం” అని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడులు ఆగే వరకు అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం లెక్కల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్‌పై 450 క్షిపణులు, 1,000 డ్రోన్‌లను ప్రయోగించింది. వీటిలో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. అయినప్పటికీ, ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌లో కనీసం 24 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడికి నిధులు సమకూర్చి, ఆయుధాలు సరఫరా చేసిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు.
అణు రియాక్టర్లపై ఆందోళన!
ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ (IAEA) అధిపతి రాఫెల్ గ్రోసీ, ఇరాన్ అణు రియాక్టర్లపై దాడులు చేయవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా బుషెహర్‌లోని అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడి జరిగితే, “పర్యావరణంలోకి భారీ స్థాయిలో రేడియోధార్మికత విడుదలవుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ అణు రియాక్టర్లను లక్ష్యంగా చేసుకోకుండా, యురేనియం సుసంపన్న కేంద్రాలపై దాడులు చేసిందని గ్రోసీ తెలిపారు. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమే అని చెబుతున్నప్పటికీ, 60% వరకు యురేనియంను సుసంపన్నం చేస్తున్న ఏకైక అణుయేతర దేశం ఇదే కావడం గమనార్హం.





