ప్రజలు తంతే ఆ పక్కన పడతారు: చంద్రబాబుపై జగన్ విమర్శలు!

  • చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని జగన్ విమర్శించారు.
  • రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతారని జోస్యం చెప్పారు.

“ప్రజలకు మంచి చేసి వారి మనసుల్లో స్థానం సంపాదించుకునేలా నాయకుడు పాలించాలి. అధికారం ఉందని దురహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారు. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చిన తీర్పులు చూశాం. ప్రజలు ఈ పక్కన తంతే.. ఆ పక్కన పడతారు. అందువల్లే చంద్రబాబు మనల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు. మనమంతా ఐక్యంగా ఉండాలి” అని వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఆ పార్టీ నేతలతో అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వైకాపాకు చెందిన స్థానిక సంస్థల ప్రజానిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. “ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలి. కానీ చంద్రబాబు హుందాగా వ్యవహరించకుండా, అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని పదవులూ తమకే కావాలన్నట్లుగా సంఖ్యాబలం లేకపోయినా ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు దిగారు. మనవాళ్లను భయభ్రాంతులకు గురిచేశారు. మరోవైపు పోలీసులను వాచ్‌మెన్ కంటే ఘోరంగా వాడుకున్నారు. మనుషులను చంపే స్థాయికి దిగజారిపోవాల్సిన అవసరం ఏముంది” అని ప్రశ్నించారు.

చంద్రబాబుపై జగన్ విమర్శలు

“సూపర్-6లో విఫలమయ్యారు, ఆయన పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్ దాటని పరిస్థితిలో పడిపోతారు. ఆ భయంతోనే ఇప్పుడు తనను ప్రశ్నించే స్వరం వినిపించకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. న్యూటన్స్ లా ప్రకారం చర్యకు, ప్రతి చర్య ఉంటుంది. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతారో అంతే వేగంతో అది పైకి లేచి ఆయనకే తగులుతుంది. కళ్లు మూసుకుంటే మూడేళ్లయిపోతుంది, ఈ మూడేళ్లూ నాకు, ప్రజలకు గట్టిగా తోడుగా నిలబడండి. తర్వాత వైకాపా కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. జగన్-2 పాలన చూస్తారు” అని నేతలతో చెప్పారు. “కర్నూలు జిల్లా నల్లకాలవలోనే వైకాపాకు బీజం పడింది. విలువలతో కూడిన రాజకీయం, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. నాలో ఈ రెండు గుణాలనూ చూసే మీరంతా నాకు తోడుగా ఇంతకాలం నిలిచారు. రాష్ట్రంలో రాజకీయాలను తిరగరాసిన చరిత్ర వైకాపాదే. జగన్ చేసినవన్నీ చేస్తా, ఇంకా ఎక్కువే ఇస్తానని ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలను కొంతమంది జనం నమ్మారు, అందువల్లే వైకాపాకు అంతకుముందు వచ్చిన 50 శాతం ఓట్ల నుంచి 10 శాతం వాళ్లకు వెళ్లాయి. అధికారంలోకొచ్చాక చంద్రబాబు తన హామీలను నిలబెట్టుకోకుండా తప్పించుకునేందుకు రాష్ట్రం అప్పులు రూ.11 లక్షల కోట్లని, రూ.12 లక్షల కోట్లని రోజుకో అబద్ధం చెబుతున్నారు. అప్పడు మాటిచ్చా కానీ, ఇప్పడు భయమేస్తోంది అంటూ మభ్యపెడుతున్నారు” అని విమర్శించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *