- తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన విఫలమైందని కేసీఆర్ విమర్శ
- రజతోత్సవం, సభ్యత్వ నమోదు, బహిరంగ సభలతో పార్టీకి ఊపొచ్చేలా ప్లాన్
తెలంగాణలో భూకంపాన్ని తలపించేలా కాంగ్రెస్ పాలన సాగుతోందని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భారాస అధినేత కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని, పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఉండనున్నాయని, అదే నెల 27న భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు.
ఎన్నికల వ్యూహం ఇదే!
‘‘భారాస మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణ అభివృద్ధికి పోరాడే పార్టీ మేమే. గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికను అక్టోబరు లేదా నవంబర్‌లో నిర్వహిస్తామని, వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం శ్రేణులు కష్టపడాలని సూచించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఉప ఎన్నికలు జరిగే 10 స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు.





