
ఒకప్పుడు పిల్లలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే ఆలోచన వస్తే? వెంటనే.. పక్కింట్లోనో.. పక్క వీధిలోనో.. ప్లే గ్రౌండ్స్ లో ఉంటారులే అనుకునే వాళ్లం. ‘రేయ్.. జాగ్రత్త. తోసుకోవద్దు. దెబ్బలు తగులుతాయ్. జాగ్రత్తగా ఆడుకుని రండి’ అని చెప్పే వాళ్లు. మీ పని మీరు చేసుకునేళ్లు. మరి, ఇప్పుడు? ‘రేయ్.. ఏం చేస్తున్నావ్?’ అంటే.. ఆన్ లైన్ లో ఉన్నా అంటూ.. వాట్సాప్ లో సమాధానం చెబుతున్నారు. ఎమోజీలతో స్పందిస్తున్నారు. పేరెంట్స్ లో కొందరు ఓ థమ్స్అప్ సింబల్ పెట్టేస్తున్నారు.. అతి కొద్ది మందే వాళ్లేం చేస్తున్నారా? అని ఓ కన్నేద్దాం అనుకుంటే.. విర్చువల్ వరల్డ్ లో నేటి తరం వాడే ఫ్లాట్ ఫామ్ లు అన్నీ… ఇన్నీ కాదు. మెసేజింగ్ అడ్డాలు, సోషల్ మీడియా వేదికలు, గేమింగ్ ఫ్లాట్ ఫామ్ లు.. ఇలా అన్ని ఆన్ లైన్ గల్లీల్లో తెగ తిరిగేస్తున్నారు. ఈ తరుణంలో పేరెంట్స్ గా మీరు ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నారు? పిల్లల ప్రైవసీ రోడ్డున పడకుండా ఉండలంటే.. ఈ చిట్కాల్ని విధిగా పాటించింది.
విధిగా పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు..
- జీవితం విలుల్ని ఎలా భోదిస్తామో. ఇంటర్నెట్ ఎథిక్స్ ని కూడా అలానే చెప్పాలి. ఇంటర్నెట్ పరిభాషలో దీన్నే డిజిటల్ వెల్ బీయింగ్ అని పిలుస్తారు. టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకోవడం ఎలాగో పిల్లలకు నేర్పాలి.
- కుటుంబం మొత్తానికి ’స్క్రీన్ టైమ్ అగ్రిమెంట్’ పెట్టుకోవాలి. ఫోన్లు, ట్యాపీలు, టీవీల్ని పక్కన పెట్టేసి.. అందరూ కలిసి కొంత సమయం గడిపే నియమం అన్నమాట. ఇంట్లో అందుకు అనువైన స్పేస్ ని డిజైన్ చేసుకుని ’టెక్ ఫ్రీ‘ జోన్స్ గా వాటిని పెట్టుకోవాలి. అక్కడే పలు ఆఫ్ లైన్ యాక్టివిటీల్ని చేయడం ద్వారా స్క్రీన్ టైమ్ ని తగ్గించొచ్చు.
- ’ఏం చదువుతున్నారా?’ అని ఎలా దగ్గర కూర్చుని చూస్తామో.. అదే మాదిరి నెట్టింటి విహారాన్ని పక్కన కూర్చుని చూడాలి. భద్రంగా బ్రౌజింగ్ ఎలా చేయాలో కలిసి కూర్చుని నేర్పాలి.
- కంటెంట్ ఫిల్టరింగ్ సాఫ్ట్ వేర్ లతో అసభ్యకరమైన కంటెంట్ పిల్లల కంట పడకుండా జాగ్రత్త పడాలి. వయసు పరిమితుల్ని సెట్ చేసి నెట్ యాక్సెస్ కంట్రోల్ చేయాలి.
- అపరిచితుల దగ్గర ఎలా ప్రవర్తించాలో చెప్పినట్టుగానే వ్యక్తిగత సమాచారాన్నీ ఎలా కాపాడుకోవాలో వివరంగా చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ పిల్లలు తమ పర్సనల్ డేటాని పంచుకోమని ప్రామిస్ చేయించాలి.
- ఎక్కడ ఎలాంటి సమాచారం దొరుకుతుందో తెలిపేలా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. నమ్మకమైన సోర్సుల్ని వెతికి వారికి పరిచయం చేయాలి.

ఇంటర్నెట్ సేఫ్టీ ఇలా..
వయసుని బట్టి ఏయే ఫ్లాట్ ఫామ్ లు (సోషల్ మీడియా, వెబ్ సైట్స్) వాడాలో నిర్ణయించాలి. 13 ఏళ్లు పైబడిన పిల్లలకి మాత్రమే ఆన్ లైన్ ఫ్లామ్ లను పరిచయం చేయాలి.
- కాపీరైట్ కంటెంట్ పై అవగాహన కల్పించాలి. కాపీరైట్ చట్టాల్ని అతిక్రమిస్తే ఏం జరుగుతుందో వివరించాలి. అప్పుడే ఇతరులు చేసిన కంటెంట్ ని గౌరవిస్తారు. కాపీ.. పేస్ట్ లు చేసి.. ఎవరో చేసిందాన్ని వాళ్లే చేసినట్టుగా గొప్పలు చెప్పుకోరు.
- ఆన్ లైన్ లో పిల్లల ఫ్రెండ్స్ లిస్ట్ ని చెక్ చేయండి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే వాళ్లెవరు, ఎందుకు యాడ్ చేశారో అడగండి. మీ అనుమతి లేకుండా కొత్త వారిని యాడ్ చేయొద్దని జాగ్రత్తలు చెప్పండి.
- సోషల్ వాల్స్ పై పిల్లలు ఏం పోస్ట్ చేస్తున్నారో చూడండి. పోస్ట్ చేసే ముందు పర్సవల్ వివరాలేమైనా ఉన్నాయేమో చెక్ చేయమనండి. టీచర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. వివరాలేవీ వారి అనుమతి లేకుండా షేర్ చేయకూడదని ఎడ్యుకేట్ చేయాలి.
- ఆన్ లైన్ లో ఉన్నవన్నీ నిజం కాదని చెప్పండి. ఏదైనా నెట్ లో వెతికిన తర్వాత తిరిగి అది కరెక్టో కాదో చెక్ చేసుకోవడం ఎలాగో నేర్పండి.

- గుడ్ టచ్.. బ్యాడ్ టచ్.. గురించి ఎలా చెబుతున్నామో.. ఆన్ లైన్ ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడినా.. ఇబ్బంది పెట్టినా.. వెంటనే తెలపమనండి. సైబార్ బుల్లీయింగ్ గురించి అవగాహన కల్పించండి.
- ఈమెయిల్ అడ్రస్ లను వాడే క్రమంలో వ్యక్తిగత వివరాల్ని ఇతరులతో షేర్ చేయొద్దుని చెప్పండి. సులభమైన పాస్ వర్డ్ లు వాడకూడదని చెప్పి.. కఠనమైన పాస్ వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్పించండి. ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్’ ని పరిచయం చేయడం మంచిది.
- ఆఫ్ లైన్ లో మర్యాదపూర్వకంగా ఎలా స్పందిస్తామో అదే మాదిరిగా ఆన్ లైన్ లో ప్రవర్తించేలా ప్రోత్సహించాలి.
- ఆన్ లైన్, ఆఫ్ లైన్ యాక్టివిటీలను బ్యాలెన్స్ చేసుకునే వారికో షెడ్యూల్ ని పెట్టాలి. అప్పడే పిల్లలు మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఫిట్ గా ఉంటారు.





