బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన రేసులో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఉదయం 10 గంటల సమయంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.
అసహనం వ్యక్తం
తన లీగల్ టీంను పోలీసులు లోపలికి అనుమతించకపోవటంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. “తాను న్యాయవాదితో విచారణకు హాజరవుతానని పోలీసులతో వాగ్వాదానికి దిగారు,” అని సమాచారం. అనంతరం తన స్టేట్‌మెంట్‌ను రాతపూర్వకంగా ఏఎస్పీకి ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్, “రేవంత్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు” చేశారు. “లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఫ్యాబ్రికేట్ చేశారని… ఈ కేసులోనూ అలాగే జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.” తాను ఏసీబీ విచారణకు హాజరు కాగానే.. తన ఇంటిపై రైడ్స్ చేయించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేసారని ఆరోపించారు. “ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, రైతు భరోసా నిధుల తగ్గింపు వంటి అంశాలను పక్కదారి పట్టేందుకు తనకు ఏసీబీ చేత నోటీసులు జారీ చేయించారని చెప్పారు.”
హైటెన్షన్ వాతావరణం
ఈ కేసు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏసీబీ ఆఫీసు ఎదుట భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు నేతలను ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది.






