- ‘‘ఎన్ని సార్లు పిలిచినా వస్తా… అవసరమైతే జైలుకైనా వెళ్తా’’
- ‘‘నాలుగు గోడల మధ్య కాదు… నాలుగు కోట్ల ప్రజల మధ్య విచారణ చేద్దాం’’
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న సందర్భంగా BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియాతో స్పందించారు. ‘‘చట్టాలపై, న్యాయవ్యవస్థపై నాకున్న గౌరవం మారదు. ఇప్పటివరకు మూడుసార్లు పిలిచారు, ఇంకెన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాను. అరెస్టు చేసినా భయపడేది లేదు. తెలంగాణ కోసం జైలు వెళ్లొచ్చాం, మళ్లీ వెళ్లాల్సి వచ్చినా వెళ్తాం’’ అని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డిపై టార్గెట్ చేస్తూ, ‘‘కేసీఆర్, హరీశ్‌రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టి ఆనందించారు. ఇప్పుడు నన్ను ఏసీబీ విచారణకు పిలిచి అదే ఆనందం పొందుతున్నారు’’ అన్నారు.
‘‘లై డిటెక్టర్‌కు సిద్ధం… మీరు రెడీనా?’’
‘‘నాలుగు గోడల మధ్య విచారణ ఎందుకు? ప్రజల మధ్య విచారణ చేద్దాం. మనిద్దరిపైనా కేసులున్నాయి. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమా?’’ అని రెచ్చగొట్టేలా ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు వల్ల తెలంగాణ పేరు ప్రపంచంలో వినిపించిందని, కానీ ఇప్పుడు తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర పరువు పోతుందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయాలని, రైతుబంధు వాగ్దానాన్ని ఎన్నికల హామీగా మలిచారని ధ్వజమెత్తారు. చివరగా, ‘‘కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలే’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.





