- ఓ కిడ్నాప్ కేసులో మలయాళ నటి లక్ష్మీ మేనన్!
- ఓ ఐటీ ఉద్యోగిని ఆమె, ఆమె స్నేహితులు కిడ్నాప్ చేసి దాడి చేశారని ఆరోపణలు
- నిందితులుగా ఉన్న ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేయగా, లక్ష్మీ మేనన్ పరారీ!?
మలయాళ నటి లక్ష్మీ మేనన్ ఇప్పుడు ఒక కిడ్నాప్ కేసులో చిక్కుకున్నారు. ఓ ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, లక్ష్మీ మేనన్ మాత్రం పరారీలో ఉన్నారని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బార్ వద్ద లక్ష్మీ మేనన్, ఐటీ ఉద్యోగి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ అక్కడితో ఆగకపోవడంతో, నటి, ఆమె స్నేహితులు ఆ ఐటీ ఉద్యోగి కారును వెంబడించారు. అతడి కారును అడ్డగించి, బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకొని దాడి చేశారని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నటి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఆమె పేరును ఇంకా ఎఫ్ఐఆర్ లో చేర్చలేదని సమాచారం. లక్ష్మీ మేనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉంది. ఆమె నటించిన ‘గజరాజు’, ‘ఇంద్రుడు’, ‘చంద్రముఖి 2’, ‘శబ్దం’ వంటి డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.





